ICC U19 Women’s T20 World Cup 2027 Schedule: మహిళా క్రికెట్లో యువ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ వేదిక సిద్ధమైంది. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027కు సంబంధించిన షెడ్యూల్, గ్రూపుల వివరాలు ప్రకటించారు. బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఇది మూడో ఎడిషన్. 2023లో ప్రారంభమైన ఈ టోర్నీలో యువ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతున్నారు. 2027 ప్రపంచకప్‌లో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్‌లోని నాలుగు వేదికల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం ఈ టోర్నీ ప్రత్యేకతగా నిలవనుంది.
నాలుగు గ్రూపుల్లో 16 జట్లు
టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచారు.
గ్రూప్ A
భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్
గ్రూప్ B
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సమోవా
గ్రూప్ C
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ
గ్రూప్ D
ఇంగ్లండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు గ్రూప్ Aలో ఉంది. ఆతిథ్య దేశమైన నేపాల్ కూడా ఇదే గ్రూపులో ఉండటంతో ఈ గ్రూప్‌లో ఆసక్తికర పోటీలు జరిగే అవకాశం ఉంది.
భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే?
భారత అండర్-19 మహిళల జట్టు తన ప్రపంచకప్ ప్రయాణాన్ని జనవరి 22న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. అదే రోజు నేపాల్ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది. టోర్నీ ప్రారంభమైన జనవరి 21న నాలుగు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆ రోజే సహ ఆతిథ్య దేశం బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో పోటీపడనుంది.
నాలుగు స్టేడియాల్లో మ్యాచ్‌లు
ప్రపంచకప్ మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్, సిల్హెట్ నగరాలతో పాటు నేపాల్ రాజధాని ఖాట్మండులో నిర్వహించనున్నారు.
బంగ్లాదేశ్‌లోని వేదికలు:
బీర్ శ్రేష్ఠ షహీద్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ క్రికెట్ స్టేడియం, చట్టోగ్రామ్
సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
నేపాల్‌లోని వేదికలు:
టీయూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
అప్పర్ ముల్పానీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
ఈ నాలుగు వేదికల్లో గ్రూప్ దశ నుంచి కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల వరకు పోటీలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 6న ఫైనల్.. విజేత ఎవరు?
జనవరి 26 వరకు గ్రూప్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. అనంతరం అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
జనవరి 21: ప్రపంచకప్ ప్రారంభం
జనవరి 22: భారత్ వర్సెస్ వెస్టిండీస్
జనవరి 26: గ్రూప్ దశ ముగింపు
ఫిబ్రవరి 4: సెమీఫైనల్స్
ఫిబ్రవరి 5: సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే
ఫిబ్రవరి 6: ఫైనల్ మ్యాచ్
ఫిబ్రవరి 7: ఫైనల్‌కు రిజర్వ్ డే
సెమీఫైనల్ మ్యాచ్‌లను చట్టోగ్రామ్‌లోని బీర్ శ్రేష్ఠ షహీద్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 6న జరగనుంది. వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్ నిర్వహణకు ఆటంకం కలిగితే ఉపయోగించేందుకు ఫిబ్రవరి 7ను రిజర్వ్ డేగా కేటాయించారు.
16 teams 👊
41 matches 🏏The ICC Women’s T20 #U19WorldCup 2027 fixtures are confirmed 🤩
More ➡️ https://t.co/atd1WxBfo1 https://t.co/qJm6ynKda4
— ICC (@ICC) October 21, 2026

