అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 కెప్టెన్ గా లారా వోల్వార్డ్ ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రకటించిన టీమ్ లో పాకిస్థాన్ కు చెందిన ఒక్క ప్లేయర్ కు మాత్రమే చోటు దక్కింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. కాగా గతేడాది భారత్ తరఫున స్మృతి మంధాన 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 763 పరుగులు చేసింది. మరోవైపు రిచా 21 మ్యాచ్‌లలో 365 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 156.65. బెంగాల్‌కు చెందిన ఈ యువ క్రీడాకారిణి 2024లో మహిళల జట్టు తరఫున రెండు అర్ధ సెంచరీలు నమోదు చేసింది. దీప్తి 2024లో భారత్ తరఫున 23 టీ20లు ఆడి 30 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది కాకుండా 115 పరుగులు కూడా సాధించింది.
ICC మహిళల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్: లారా వోల్వార్డ్ట్ (c), స్మృతి మంధాన, చమరి అటపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (wk), మరిజాన్ కాప్, ఓర్లా పెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సాడియా ఇక్బల్.