ICC Announces T20I Rankings and Best T20 World Cup 2022 Team: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో.. భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ, భారత్ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తంగా 268 రేటింగ్ పాయింట్లతో రోహిత్ సేన టాప్ పొజీషన్లో ఉంది. ఇక ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 265 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉండగా.. ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ 258 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాల్గో స్థానంలో సౌతాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజీల్యాండ్ జట్లు ఉండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచాయి.
ఇక ఇదే సమయంలో.. టీ20 వరల్డ్‌కప్ 2022లో ఉత్తమ టీమ్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు మూడు, నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ఈ టోర్నీలో కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేయగా, సూర్య 189.68 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. కోహ్లీ తన ఖాతాలో నాలుగు అర్థశతకాలు వేసుకోగా, సూర్య మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అందుకే.. కోహ్లీని వన్‌డౌన్‌లో, సూర్యని నాలుగు స్థానంలో ఐసీసీ సెలెక్ట్ చేసింది. ఓపెనర్లుగా జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్‌లను ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ ఇచ్చిన ఐసీసీ.. బౌలర్లుగా సామ్ కర్రన్, అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా), మార్క్ వుడ్, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు అవకాశం కల్పించింది. ఈ జట్టుకు జోస్ బట్లర్‌ను సారధిగా, వికెట్ కీపర్‌గానూ ఎంచుకుంది. ఇక హార్దిక్ పాండ్యా కూడా బంతితో పాటు బ్యాట్‌తోనూ తన ప్రతాపం చూపించడంతో.. 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.