NTV Telugu Site icon

Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్

Hyderabad Gymkhana

Hyderabad Gymkhana

Huge Crowd Gathers At Hyderabad Gymkhana For Ind vs Aus Match Tickets: సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! మూడేళ్ల విరామం తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కి అతిథ్యం ఇవ్వనుండడంతో, టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం గురువారం చేపట్టనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించడంతో.. సికింద్రాబాద్‌లోని జిమ్‌ఖానా మైదానానికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్‌సీఏ పేర్కొనడంతో.. రాత్రి నుంచే జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

ఇదిలావుండగా.. తొలుత ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకంపై విషయంపై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్టు హెచ్‌సీఏ పేర్కొంది. అయితే.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలామంది ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానుల తమ ఆందోళన వ్యక్తం చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ బుధవారం అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే జిమ్‌ఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో.. ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు చేరుకున్నారు. అయితే.. గేట్లు మూసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొందరు మైదానంలోకి దూసుకెళ్లి.. ‘హెచ్‌సీఏ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు తీశారు. అప్పుడు హెచ్‌సీఏ అధికారులు దిగి రావడం, గురువారం టికెట్లు అమ్ముతామని హామీ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.

ఇలా టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో.. తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. టీ20 మ్యాచ్ టికెట్లపై అవకతవకలపై విచారణ జరుపుతామని, బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ టికెట్ల వ్యవహారంపై క్రీడా, పోలీస్ శాఖలు నిఘా ఉంటాయని.. హెచ్‌సీఏ కేవలం పది మంది అనుభవించడం కోసం కాదని.. ఉప్పల్ స్టేడియంకు ప్రభుత్వం 23 ఎకరాలు విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించొద్దని అన్నారు.