HCA Former Presidents Demands For Quick Elections: సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీతో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో క్లబ్ సెక్రటరీలతో సమావేశం జరగాల్సింది. 140 మంది క్లబ్ సెక్రటరీలైతే వచ్చారు కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యవేక్షక కమిటీ హాజరు కాలేదు. తద్వారా ఈ క్లబ్ సెక్రటరీ మీటింగ్ వాయింగ్ పడింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ మాజీ ఉపాధ్యాక్షులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. హెచ్‌సీఏ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తొలుత అర్షధ్ అయుబ్ (హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు) మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీని కలిసేందుకు క్లబ్ సెక్రటరీస్ & మాజీ అధ్యక్షులంతా వచ్చామని, కానీ ఆ కమిటీ అందుబాటులో లేదని నిరాశ వ్యక్తపరిచారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలన్నారు. అంతకంటే ముందు.. అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ (ఏజీఎం) నిర్వహించాలని పర్యవేక్షక కమిటీకి విజ్ఞప్తి చేశారు. గతంలో మెంబెర్స్, ప్రెసిడెంట్స్, మాజీ కార్యదర్శులందరూ తమ విన్నపాలు పర్యవేక్షక కమిటీకి అందజేశామన్నారు.
అనంతరం శివలాల్ యాదవ్ (బీసీసీఐ ఉపాధ్యక్షుడు & హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు) మాట్లాడుతూ.. సెప్టెంబర్ 26తో అజారుద్దీన్ టర్మ్ ముగిసిందని, ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని అసంతృప్తి వెళ్లగక్కారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పర్యవేక్షక కమిటీని విజ్ఞప్తి చేసేందుకు తామంతా వచ్చామన్నారు. అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు త్వరగా నిర్వహించాల్సిందిగా తాము కమిటీని కోరుతున్నామని, హెచ్‌సీఏలో ఉన్న సమస్యల్ని ఆ కమిటీ పరిష్కరిస్తుందని నమ్మకముందని తెలిపారు.
ఇక చివరగా వినోద్ (హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు) మాట్లాడుతూ.. హెచ్‌సీఏలో ఒక గందరగోళం నెలకొందని, పర్యవేక్షక కమిటీపై తమకు నమ్మకం ఉందని అన్నారు. వీలైనంత త్వరగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే, అందులో అనేక అంశాలు చర్చించుకుంటామన్నారు. తాను 12 ఏళ్లుగా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు ఎలాంటి సమస్యలూ రాలేదని, కానీ అజార్ నేతృత్వంలో ఉన్న కమిటీ అనేక సమస్యల్ని తెచ్చిపెట్టిందన్నారు. అజార్ టర్మ్ ముగిసింది కాబట్టి.. ఎన్నికల్ని వెంటనే జరపాలని పర్యవేక్షక కమిటీకి విజ్ఞప్తి చేశారు.