Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

  • టీ20 సిరీస్‌లో మరోసారి నిరాశపరిచిన భారత్
  • టీమిండియాపై సిరీస్ గెలవడం ఎంతో సంతోషం
  • ఐయామ్ ఫుల్ హ్యాపీ అంటున్న ఇంగ్లండ్ కెప్టెన్
Harry Brook Interview

Harry Brook Interview

Harry Brook Happy About India Lost Matches vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ మరోసారి నిరాశపరిచింది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టును ఓడించడం ఎప్పుడూ ప్రత్యేకమేనని పేర్కొన్నాడు. పటిష్ట టీమిండియాపై సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.

భారత్‌ను ఓడించడం ఎప్పుడూ ప్రత్యేకమే:

నాలుగో టీ20 మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘ఈరోజు మ్యాచ్ ఎంతో సరదాగా సాగింది. ఎన్నో ఏళ్లుగా భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లలో ఒకటిగా ఉంది. అలాంటి జట్టును 3-0తో ఓడించి సిరీస్ గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఆటగాళ్లంతా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో సమిష్టి ప్రదర్శన కనబరిచాం. ఐయామ్ ఫుల్ హ్యాపీ’ అని చెప్పాడు.

మా బలమే బ్యాటింగ్ డెప్త్:

‘మాకు లోతైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. ఈ మ్యాచ్‌లో రెహాన్ అహ్మద్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించాం. అతను కూడా భారీ షాట్లు ఆడగలడు. బ్రిస్టల్ మైదానంలో బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటింగ్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టాం. అదే మాకు విజయాన్ని అందించింది. జట్టు విజయానికి ఆటగాళ్లు, కోచ్‌ల మధ్య ఉన్న సమన్వయమే ప్రధాన కారణం. పిచ్‌కు తగ్గట్టుగా ఎలా ఆడాలనే విషయంపై కోచ్‌లతో నిరంతరం చర్చించాం. ఆటగాళ్లు, కోచ్‌ల మధ్య జరిగిన కమ్యూనికేషన్ బాగుంది. సీనియర్ ఆటగాళ్లు కూడా బౌలర్లకు, యువ క్రికెటర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించారు. వికెట్‌కీపర్ జోస్ బట్లర్ స్పిన్నర్లకు కీలక సూచనలు చేస్తూ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు’ అని బ్రూక్ వివరించాడు.

ప్రపంచ నంబర్ వన్ లక్ష్యం:

టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా ఎదగాలన్నదే తమ తదుపరి లక్ష్యమని హ్యారీ బ్రూక్ స్పష్టం చేశాడు. ‘ప్రపంచ నంబర్ వన్ జట్టుగా మారడం ఎంతో గొప్ప విషయం. అదే మా లక్ష్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన విధానాన్నే కొనసాగిస్తాం. మా ప్రణాళికలను మార్చకుండా ముందుకు వెళ్తాం. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి 4-0తో సిరీస్‌ను ముగించాలని ఆశిస్తున్నాం’ అని ఇంగ్లండ్ బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఓటమితో భారత్ సిరీస్‌ను కోల్పోగా.. చివరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి 4-0తో సిరీస్‌ను ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం భారత్ ఆటతీరు చూస్తుంటే భారత్‌కు విజయం అంత ఈజీ కాదు.