సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికీ ఒక ఫేవరేట్ క్రికెటర్ ఉంటారు. అందరూ దాదాపు బాగా పేరుగడించిన దిగ్గజాల పేర్లే చెప్తారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అందుకు భిన్నంగా ఆశ్చర్యపరిచాడు. తనకు సచిన్, కోహ్లీ లాంటి డ్యాషింగ్ ప్లేయర్లు ఇష్టమేనని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్.. ఫేవరేట్ ప్లేయర్ మాత్రం వసీమ్ జాఫర్ అని చెప్పుకొచ్చాడు. ‘‘అందరికీ తమకంటూ ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నాకూ ఉన్నారు. జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే నాకెంతో ఇష్టం. కానీ, అత్యంత ఫేవరెట్ క్రికెటర్ మాత్రం వసీమ్ జాఫర్’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. వసీమ్ బ్యాటింగ్ శైలి తనకెంతో ఇష్టమని, ఫీల్డ్‌లో ఆయన బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తుండిపోయేవాడినని అన్నాడు. ఆయన బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ కొట్టడానికి చాలాసార్లు ప్రయత్నించానని, కానీ కాపీ చేయలేకపోయానన్నాడు. మిగతా దిగ్గజాలతో పోలిస్తే ఆయనకు తన మనసులో అగ్రస్థానం ఉంటుందన్నాడు.
కాగా.. క్రికెట్‌ను ఫాలో అయ్యే వారికి వసీమ్ జాఫర్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రకు చెందిన ఈ మాజీ ఓపెనర్.. 2000- 2008 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 31 టెస్టుల్లో 1944 పరుగులు, 2 వన్డేల్లో 10 పరుగులు సాధించాడు. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం వసీమ్ జాఫర్‌కు తిరుగులేదు. 260 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడియన ఆయన.. ఏకంగా 19,410 పరుగులు చేశాడు. ఇందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఈయన చరిత్రపుటలకకెక్కాడు. అంతేకాదు.. వసీమ్ 2020-2021 సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు, 2021 జూలైలో ఒడిశా జట్టు హెడ్‌కోచ్‌గానూ నియమితుడయ్యాడు. వసీం జాఫర్‌కు సచిన్, ద్రవిడ్, సెహ్వగ్, లక్ష్మణ్ వంటి మేటి బ్యాటర్లు సమకాలీనులు కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.