Site icon NTV Telugu

Hardik Pandya: అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల సరసన నిలిచిన తొలి భారత ఆల్‌రౌండర్

Hardik Pandya Rare Record

Hardik Pandya Rare Record

Hardik Pandya Becomes First Indian Allrounder To Achieve This Record: భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనం ఇచ్చినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అంతకుముందు ఈ సీజన్ ఐపీఎల్‌లో సారథిగా తన జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుని ఛాంపియన్‌గా నిలిపిన ఇతగాడు.. టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చాక వరుసగా రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాడు. రీసెంట్‌గానే మూడు ఫార్మాట్లలో నాలుగు వికెట్లు, అర్థశతకం చేసిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా చరిత్రపుటలకెక్కిన హార్దిక్, తాజాగా అలాంటి ఘనతే మరొకటి సాధించాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో హార్దిక్ తన బ్యాటుని ఝుళపించలేకపోయాడు కానీ, బంతితో మాయ చేయగలిగాడు. నాలుగు ఓవర్లు వేసిన ఇతను, కేవలం 19 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బ్రాండన్‌ కింగ్‌ను అతడు పెవిలియన్‌కు పంపించాడు. ఈ వికెట్‌ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా హార్దిక్ ఓ అరుదైన మైలురాయిని అందుకోగలిగాడు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా.. టీ20 క్రికెట్‌లో 800కు పైగా పరుగులు, 50 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు సంపాదించాడు.

ఈ జాబితాలో షకీబ్‌ అల్‌ హసన్‌ (2010, 121) అగ్రస్థానంలో ఉండగా.. ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా (806, 50) నిలిచాడు. షాహిద్‌ ఆఫ్రిది (1416, 98), డ్వేన్‌ బ్రావో (1255, 78), మహ్మద్‌ నబీ (1628, 76), మహ్మద్‌ హఫీజ్‌ (2514, 61), కెవిన్‌ ఒబ్రెయిన్‌ (1973, 58) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొంది, సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

Exit mobile version