సౌరవ్ గంగూలీ సారథ్యంలో హర్భజన్ సింగ్ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తాను చాలాసార్లు విఫలమైనా, వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అవకాశాలు కల్పించాడు. భజ్జీ కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెలరేగిపోయాడు. గంగూలీ మద్దతుతో తన సత్తా చాటుకున్నాడు. అలాంటి గంగూలీపైనే హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాను లేకపోతే గంగూలీ గెలిచేవాడు కాదని, కెప్టెన్సీ కోల్పోయేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాకపోతే, ఇది సీరియస్ టోన్‌లో కాదులెండి, కామెడీగానే అలా చెప్పుకొచ్చాడు.
ఓ క్రీడా ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంగూలీ నాకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే, అతడు ఆ సిరీస్ గెలిచుండేవాడు కాదు. అది గెలవకుంటే, దాదా టీమిండియా కెప్టెన్సీ కూడా కోల్పోయేవాడు’’ అని పేర్కొన్నాడు. గంగూలీ తన కెరీర్‌కి మెరుగులు దిద్దిన దేవుడు లాంటి వాడని, తన చెయ్యి పట్టుకుని అతడు నడిపించాడని అన్నాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు దాదా తనకి మద్దతుగా నిలిచాడని, క్రమం తప్పకుండా అవకాశాలు ఇచ్చాడని గుర్తు చేశాడు. ‘అయితే.. ఎన్ని అవకాశాలొచ్చినా నిరూపించుకోవాల్సింది మనమే కదా, లేకుండా ఏ కెప్టెన్ మిమ్మల్ని రక్షించలేడ’ని భజ్జీ వెల్లడించాడు.
ఇదే సమయంలో 2007 ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి గురించి మాట్లాడుతూ.. అప్పుడు భారత్ ఓటమికి అప్పటి కోచ్ గ్రెగ్ ఛాపెల్ కారణమని కుండబద్దలు కొట్టాడు. ఒకవేళ అతడు కోచ్‌గా లేకుంటే, భారత జట్టు మరింత బాగా ఆడి ఉండేదన్నాడు. అతడు హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం భారత జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా సంతోషంగా లేడని బాంబ్ పేల్చాడు. కాగా.. 2001లో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చినప్పుడు, తొలి టెస్ట్‌లో గంగూలీ సేన దారుణంగా ఓడింది. కానీ, ఆ తర్వాత పుంజుకొని సిరీస్ ను 2-1 తో నిలబెట్టుకుంది. ఈ సిరీస్‌లో భజ్జీ ఏకంగా 3 టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు.