టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అప్పట్లో శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన సంఘటన గుర్తుందా? ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీనియర్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న నెపంతో.. కోపాద్రిక్తుడైన హర్భజన్ లాగి ఒక్కటిచ్చాడు. ఆరోజుల్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు ‘స్లాప్ గేట్’ అనే ముద్ర కూడా పడింది. అప్పట్లో ఈ ఉదంతంపై హర్భజన్ పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే, ఇన్నాళ్ల తర్వాత ఆ ఘటనని గుర్తు చేసుకుంటూ ‘తాను చేసింది ముమ్మాటికీ తప్పే’నని తన తప్పుని ఒప్పుకున్నాడు.
‘‘అప్పుడు ఏదైతే జరిగిందో, అది ముమ్మాటికీ తప్పే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల తోటి క్రీడాకారుడు సిగ్గుపడాల్సి వచ్చింది. నన్నూ సిగ్గుపడేలా చేసింది’’ అని గ్లాన్స్ లైవ్ ఫెస్ట్‌లో హర్భజన్ చెప్పుకొచ్చాడు. తాను చేసిన తప్పుల్లో ఏదైనా సరిదిద్దుకోవాల్సిన తప్పు ఉందంటే.. అది మైదానంలో శ్రీశాంత్‌పై తాను ప్రవర్తించిన తీరేనని అన్నాడు. అప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదని, ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా తాను అలా కొట్టాల్సిన అవసరం లేదనిపిస్తుందని పేర్కొన్నాడు. చాలా ప్లాట్‌ఫామ్స్‌లోనూ తాను ఈ తప్పుని అంగీకరించానని హర్భజన్ వెల్లడించాడు. కాగా, ఆ ఒక్క చెంప దెబ్బ కారణంగా హర్భజన్ ఆ టోర్నీలో మిగతా 11 మ్యాచ్‌లకు దూరమవ్వాల్సి వచ్చింది.
మరోవైపు.. హర్భజన్‌తో తనకు ఎలాంటి విభేదాలు గతంలోనే చాలాసార్లు శ్రీశాంత్ స్పష్టం చేశాడు. ఆ ఘటన జరిగిన తర్వాత సచిన్ టెండూల్కర్ ఇద్దరికీ విందు ఏర్పాటు చేసి.. ఆ వివాదం సద్దుమణిగేలా చేశారని శ్రీశాంత్ తెలిపాడు. అందుకు తాను సచిన్‌కు ఎప్పటికీ రుణ పడి ఉంటానన్నాడు. అయితే, మీడియా మాత్రం ఆ చెంప దెబ్బ ఇష్యూని వేరే లెవెల్‌కు తీసుకెళ్లిందని పేర్కొన్నాడు.
