Site icon NTV Telugu

Graeme Swann: ఇషాన్ కిషన్ వద్దు.. కోహ్లీని పంపండి

Greame Swann On Virat Kohli

Greame Swann On Virat Kohli

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్మన్లందరూ రాణిస్తే.. ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. 10 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌కు బదులుగా కోహ్లీని ఓపెనర్‌గా దింపాలని కోరాడు. కోహ్లీ లాంటి మేటి ఆటగాడ్ని మూడో స్థానంలో ఆడించొద్దని సూచించాడు.

‘‘విరాట్‌ కోహ్లీ తుది జట్టులోకి వస్తే.. అతడు ఇషాన్ కిషన్‌కి బదులుగా ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నా. కోహ్లి వంటి అద్భుతమైన ఆటగాడిని మూడో స్ధానంలో పంపకూడదు. ఆ స్థానంలో కోహ్లీ వస్తే.. త్వరగా పరుగులు చేయలేడు. అతడు కుదురుకోవడానికి కాస్త సమయం కావాలి. మధ్య ఓవర్లలో అతడు హూడా, సూర్య లాగా ప్రభావవంతంగా రాణించలేకపోతున్నాడు. కాబట్టి.. కోహ్లీ ఓపెనర్‌గానే రావాలి. అవతలి ఎండ్‌లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడిస్తే.. అతడ్ని కోహ్లీ ఫాలో అవుతాడు. ఫలితంగా.. ఇద్దరూ భారీ స్కోర్‌లు చేసి, భారత్‌కి అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వగలరు. ఆ తర్వాత వచ్చే హూడా, సూర్య.. తమ పని తాము చేసుకుపోతారు’’ అంటూ గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు.

కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ మినహా మిగతా బ్యాట్స్మన్లందరూ రాణించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్మన్లను భారత బౌలర్లు మొదట్నుంచే కట్టడి చేయడంతో.. ప్రత్యర్థి జట్టు 148 పరుగులకే కుప్పకూలింది.

Exit mobile version