NZ Vs SL: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో రెండో సెంచరీ నమోదైంది. ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ బంగ్లాదేశ్‌పై మెరుపు సెంచరీ చేయగా తాజాగా శ్రీలంకపై న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ బాదాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఫిలిప్స్ సెంచరీతో ఆదుకున్నాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ (22) సాయంతో నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. అంతర్జాతీయ టీ20లలో ఫిలిప్స్‌కు ఇది రెండో సెంచరీ. అతడు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
Read Also: Sugar Exports: చక్కెర ఎగుమతులపై నిషేధం.. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పొడిగింపు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత రాణించిన శ్రీలంక బౌలర్లు అనంతరం పట్టు విడిచారు. దీంతో న్యూజిలాండ్ కోలుకుని మంచి స్కోరు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత రెండు, మహేష్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, లాహిరు కుమార తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే 20 ఓవర్లలో 168 పరుగులు చేయాలి. కాగా ఈ సిరీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. తాము కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ షనక చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం తాము ఒక మార్పు చేశామని.. బినురా ఫెర్నాండో స్థానంలో కాసున్ రజితా జట్టులోకి వచ్చాడని.. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఈ మార్పు చేశామని షనక స్పష్టం చేశాడు.
