IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!

Gautam Gambhir Dhruv Jurel

Gautam Gambhir Dhruv Jurel

Dhruv Jurel Gets Big Message From Gautam Gambhir: ఆగష్టు 15 నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, దేశవాళీ కింగ్ సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే జురెల్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తిగా ఉందట. ఈ క్రమంలో అతడికి కీలక సూచనలు చేస్తూనే.. ఇలానే కొనసాగితే తుది జట్టులో చోటు ఉండదు అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్క హాఫ్ సెంచరీ లేదు:

ప్రస్తుతం రిషభ్ పంత్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్నాడు. దాంతో ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడుతున్నాడు. గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జురెల్ 2025 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ టెస్టు సిరీస్‌లోనూ రన్స్ చేయలేదు. భారత్ ఆ సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. జురెల్ తక్కువ స్కోర్లకే ఔటవడం, వికెట్‌ను సులభంగా చేజార్చుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం.

మరింత స్థిరమైన ప్రదర్శన అవసరం:

అఫ్గానిస్థాన్‌తో జూన్‌లో జరిగిన ఏకైక టెస్టులో ధ్రువ్ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత శ్రీలంక ‘ఏ’ జట్టుతో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కానీ టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం 1, 17 పరుగులకే పరిమితమయ్యాడు. జురెల్ బ్యాటింగ్ సగటు 34.14కు పడిపోయింది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడాలంటే.. మరింత స్థిరమైన ప్రదర్శన అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి సూచించినట్లు తెలుస్తోంది.

జురెల్ vs సర్ఫరాజ్:

సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అతడి రీఎంట్రీతో నంబర్ 6 స్థానంపై పోటీ మరింత వేడెక్కింది. జురెల్ కంటే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువగానే ఆడినా.. రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా చేశాడు. ఇద్దరి ఖాతాల్లోనూ సెంచరీలు సమానంగా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై సర్ఫరాజ్‌ చెలరేగే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్‌ను బాగా ఎదుర్కొనే సత్తా ఉన్న అతడు.. టర్నింగ్ ట్రాక్‌లపై భారత మిడిలార్డర్‌కు ఉపయోగపడే ఆటగాడిగా భావిస్తున్నారు. దాంతో తొలి టెస్టులో గంభీర్, గిల్.. జురెల్‌కు మరో అవకాశం ఇస్తారా? లేదా స్పిన్‌ను బాగా ఆడగల సర్ఫరాజ్ ఖాన్‌ను నంబర్ 6లోకి తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.