Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!

  • కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్‌
  • 19 బంతుల్లోనే 39 పరుగులు చేసిన రాహుల్
  • బిత్తరపోయిన గౌతమ్ గంభీర్
Kl Rahul Gautam Gambhir

Kl Rahul Gautam Gambhir

Gautam Gambhir Stunned by KL Rahul’s Six: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ దూకుడు ఇన్నింగ్స్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యాడు. ఓ సిక్సర్‌కు అయితే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

195 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని అందించగా.. చివర్లో కేఎల్ రాహుల్ తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు డగౌట్‌లో కూర్చున్న కోచ్ గౌతమ్ గంభీర్ బిత్తరపోయాడు. జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ బౌలింగ్‌లో రాహుల్ లాంగ్ ఆన్ దిశలో భారీ సిక్సర్‌ బాదాడు. ఆ షాట్ చూసిన గంభీర్.. అబ్బా ఏం షాట్ ఆడాడు అన్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వన్డే జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న లోకేష్ రాహుల్.. ఈ మ్యాచ్ ద్వారా తాను అవసరమైతే టి20 శైలిలోనూ వేగంగా పరుగులు చేయగలనని నిరూపించాడు. మిడిల్ ఓవర్లలో సహచర ఆటగాడిపై ఒత్తిడిని తగ్గిస్తూ.. చివర్లో వేగం పెంచే తన సామర్థ్యాన్ని మరోసారి చూపించాడు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ భారత జట్టు యాజమాన్యానికి కూడా మంచి సంకేతంగా మారింది. శుభ్‌మన్ గిల్ అజేయ 84 పరుగులు, రాహుల్ మెరుపు 39 పరుగులతో భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.