NTV Telugu Site icon

Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ జట్టుకు దినేశ్‌ని ఎంపిక చేయడం వృధా!

Gambhir On Dinesh Karthik

Gambhir On Dinesh Karthik

అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తుది జట్టులో ఎవరెవరికి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న విషయాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాడు. రీసెంట్‌గానే ఇషాన్ కిషన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకోవాల్సిందేనని, అతడ్ని ఓపెనర్‌గా రంగంలోకి దింపితే పరుగుల వర్షం కురవడం ఖాయమని ఆయనన్నాడు. కానీ, దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేయడం వృధా అంటూ బాంబ్ పేల్చాడు. కార్తీక్ ఆఖర్లో కేవలం రెండు, మూడు ఓవర్లు మాత్రమే ఆడతానంటే కుదరదని కుండబద్దలు కొట్టాడు.

కార్తీక్‌ లాంటి మ్యాచ్‌ ఫినిషర్‌ కోసం టీమిండియా వెతుకుతున్న విషయం వాస్తవమే కానీ.. ఆ రోల్‌కు సంపూర్ణ న్యాయం జరగాలంటే మాత్రం ఆల్‌రౌండర్ అయితేనే బెటరని గంభీర్ తెలిపాడు. డీకే కేవలం రెండు, మూడు ఓవర్లు ఆడేందుకు పరిమితమైతే.. అతడ్ని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయడం వృధా అని అన్నాడు. కార్తీక్‌కు బదులు తాను రిషభ్ పంత్‌, దీపక్‌ హూడా, జడేజా, హార్థిక్‌ పాండ్యా లాంటి ఆటగాళ్లను ప్రిఫర్‌ చేస్తానన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్నప్పుడు.. కార్తీక్‌కి జట్టులో చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. కార్తీక్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో పాటు సుదీర్ఘంగా క్రీజ్‌లో ఉండటంపై దృష్టి సారించాలని గంభీర్ సూచించాడు.

ఇదిలావుండగా.. టీమిండియాలో చోటు కోసం చాలాకాలం నుంచి శ్రమిస్తున్న 37 ఏళ్ల కార్తీక్, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అద్భుత పెర్ఫార్మెన్స్ కనబరిచి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆర్సీబీ తరఫున మెరుపులు మెరిపించి, బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌.. 55 సగటున 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రిఖాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడుతున్నాడు.