న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ.. బ్యాటింగ్‌పై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగో వన్డేలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ కావడం, ఐదో వన్డేలోనూ 209 పరుగులకే పరిమితం కావడం జట్టు బ్యాటింగ్ బలహీనతలను మరోసారి బయటపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తం చేసిన ఆందోళనను భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సమర్థించారు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ పర్యటనలోని పరిస్థితులు 2027 వన్డే ప్రపంచ కప్ జరిగే దక్షిణాఫ్రికా పరిస్థితులకు దగ్గరగా ఉంటాయని గౌతమ్ గంభీర్ గతంలో పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని సూచించారు. నాలుగో వన్డేలో భారత్ 90 పరుగుల లోపే ఆలౌట్ కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదో వన్డేలో విజయం సాధించినప్పటికీ.. రవిశాస్త్రి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదో వన్డే అనంతరం సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి.. గంభీర్ తన గత ప్రెస్మీట్లో చెప్పింది సరైనదేనని అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌లోని పరిస్థితులు దక్షిణాఫ్రికాలో ఎదురయ్యే పరిస్థితులకు దగ్గరగా ఉంటాయని, అందుకే భారత బ్యాటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రతి మ్యాచ్‌లోనూ 300 నుంచి 320 పరుగులు చేయాలనే లక్ష్యంతో ఆడాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి సూచించారు. కొన్ని పిచ్‌లపై 260 లేదా 270 పరుగులు కూడా విజయాన్ని అందించే స్కోరుగా ఉంటుందన్నారు. బౌలర్లకు అనుకూలించే పరిస్థితుల్లో బ్యాటర్లు కొంత సమయం క్రీజులో నిలబడి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా క్లిష్టమైన సమయంలో వికెట్లు కాపాడుకోవడం, సరైన షాట్లు ఎంపిక చేసుకోవడం కీలకమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. బే ఓవల్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో స్వింగ్, సీమ్‌కు అనుకూలించిన పరిస్థితులను భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పయింది.
ఆ మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. 90 పరుగులకే ఆలౌట్ కావడం ఆందోళన కలిగించే విషయమేనని అన్నారు. అయితే, తక్కువ పరుగులు చేయడం కంటే 26-27 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోవడమే తనకు పెద్ద సమస్యగా అనిపించిందని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎదురయ్యే బంతులన్నీ ఆడలేనివి కావని, బౌలర్లు మంచి ప్రాంతాల్లో బంతులు వేసినప్పటికీ బ్యాటర్లు వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ఐదో వన్డేలో భారత్ 209 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలోని భారత బౌలింగ్ విభాగం న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది. సిరీస్ విజయం కంటే 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సిన అవసరమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

