ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ మరోసారి భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేపారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ విషయంలో గంభీర్ ప్రవర్తన సరిగా లేదని, వ్యక్తిగత పక్షపాతాన్ని చూపుతున్నాడని పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సమస్య ఇప్పటిది కాదని.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రోజుల్లోనే గంభీర్-శ్రేయస్‌ల మధ్య వివాదం మొదలైందన్నారు. గౌతీది వ్యక్తిగత ద్వేషం అని స్పష్టంగా తెలుస్తోందని పాంటింగ్ అన్నాడు.
విశాఖలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఆడలేదు. ఆతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సింది. కానీ అనూహ్యంగా అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చారు. అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయడం వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నాడనే వార్తలు చక్కర్లుకొట్టాయి. సోషల్ మీడియాలో కూడా గౌతీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉండగా.. మెంటర్ పాత్రలో గౌతమ్ గంభీర్ సేవలందించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నట్లు సమాచారం. అందుకే శ్రేయస్‌ను గౌతీ పక్కన పెడుతున్నాడట. తాజాగా ఈ వివాదంపై రికీ పాంటింగ్ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: PT Usha Husband: ఇంట్లో కుప్పకూలి.. పీటీ ఉషా భర్త కన్నుమూత!
‘శ్రేయస్ అయ్యర్‌ను గౌతమ్ గంభీర్ ట్రీట్ చేస్తున్న విధానం చూస్తే స్పష్టంగా వ్యక్తిగత ద్వేషంలా కనిపిస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది కేకేఆర్ రోజుల్లోనే మొదలైంది. రిషభ్ పంత్ విషయంలో కూడా గంభీర్ ఇదే తరహా వైఖరిని చూపించాడు. విఫలమైన, అసూయతో ఉన్న ఓ మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తే ఇలాగే జరుగుతుంది. గంభీర్‌కు కోచింగ్ అనుభవం అసలు లేదు. అయినా అతడిని హెడ్ కోచ్ లాంటి పెద్ద స్థాయి బాధ్యతల్లో పెట్టడం భారత క్రికెట్‌కు ప్రమాదకరం. ఈ వ్యవహారాన్ని బీసీసీఐ తక్షణమే పరిష్కరించాలి. లేదంటే సమీప భవిష్యత్తులో భారత క్రికెట్ భారీ పతనాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కోచ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ద్వేషాలు జట్టు ఎంపికలు, ఆటగాళ్ల కెరీర్‌లపై ప్రభావం చూపితే.. అది జట్టుకే నష్టం’ అని రికీ పాంటింగ్ హెచ్చరించాడు. పాంటింగ్ వ్యాఖ్యలతో గంభీర్–శ్రేయస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై గంభీర్ లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
