Kris Srikkanth Slams Gautam Gambhir: ఇంగ్లండ్ పర్యటనను భారత్ నిరాశాజనకంగా ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు చేసినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో విజయం దూరమైంది. ఈ ఓటమి అనంతరం భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్, 1983 ప్రపంచ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
క్రిస్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను సరైన బ్యాటింగ్ స్థానంలో ఉపయోగించడం లేదు. భారీ లక్ష్యాన్ని ఛేదించే మ్యాచ్‌లో రాహుల్‌ను ఆరో స్థానంలో పంపడం ఏమాత్రం సమంజసం కాదు. ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రాహుల్‌ను ఆరో స్థానంలో పంపిస్తారా?. భారీ చేజ్‌లలో ఎన్నో విజయాలు అందించిన ఆటగాడు అతడు. రాహుల్ నిజంగా ఆరో లేదా ఏడో స్థానంలో ఆడే బ్యాటరా?’ అని ప్రశ్నించాడు.
‘సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లను ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ గందరగోళానికి గురిచేసింది. ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలో కూడా అదే చేస్తోంది. ఇది రాహుల్‌కు జరుగుతున్న ఘోర అన్యాయం అనే చెప్పాలి. అతని బాడీ లాంగ్వేజ్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది’ అంటూ క్రిస్ శ్రీకాంత్ విమర్శించాడు. మూడో వన్డేలో భారత్‌కు చివరి ఆరు ఓవర్లలో 84 పరుగులు అవసరమైన సమయంలో రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే మ్యాచ్ దాదాపు భారత్ చేతిలో నుంచి జారిపోయింది. రాహుల్ కేవలం 8 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
‘భారత్‌కు ఆ సమయంలో జోస్ బట్లర్ తరహాలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బ్యాటర్ అవసరం. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ త్వరగా అవుట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. అలాంటి సమయంలో లోకేష్ రాహుల్‌ను నాలుగో స్థానంలో పంపి ఉంటే.. 2023 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడినట్లే మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పేవాడు. మ్యాచ్ దాదాపు ముగిసిపోయిన తర్వాత రాహుల్‌ను క్రీజులోకి పంపారు. ఓవర్‌కు 15 పరుగులు అవసరమైన సమయంలో అక్షర్ పటేల్‌తో కలిసి అతను ఎలా మ్యాచ్ గెలిపించగలడు?’ అంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు.
2023 వన్డే ప్రపంచ కప్‌లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. అక్షర్ పటేల్‌ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ స్థానం, టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

