పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో–జీన్ జులియెన్ రోజర్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు.
2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది. కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్ దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న..ఐజముల్ హక్ ఖురేషీ తో కలిసి 2010 US ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.