Site icon NTV Telugu

నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల చేతుల్లో టీమిండియా భవితవ్యం

టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష !

అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, హజ్రతుల్లా జజాయ్ కీలకమైన ఆటగాళ్లు. ఈ నలుగురు ఆటగాళ్లను అప్ఘనిస్తాన్ జట్టు ఈరోజు తుదిజట్టులో ఆడించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో రషీద్‌ ఖాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు కూడా సారథి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌కు అతడిపై అవగాహన ఉంటుందని.. టీ20 క్రికెట్‌లో రషీద్‌కు ఉన్న అనుభవంతో ఈ మ్యాచ్‌లో రాణించాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.

మరోవైపు ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కూడా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకే ఆడుతున్నాడు. 308 టీ20లు ఆడిన నబీ 293 వికెట్లు, 4,801 పరుగులు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు కూడా సత్తా చాటాలి. అటు యువ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ దూకుడుగా ఆడతాడు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న కివీస్ బౌలర్లను కాచుకుని అతడు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కాగా ముజీబుర్ రెహ్మాన్‌కు ఫిట్‌నెస్ సమస్యలు ఉండటంతో అతడు తుదిజట్టులో ఆడతాడో లేదో వేచి చూడాలి.

Exit mobile version