NTV Telugu Site icon

Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్‌ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Fifa World Cup 2022

Fifa World Cup 2022

Fifa World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పోటీ పడ్డాయి. క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా సెమీఫైనల్ చేరాయి. వీటిలో రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందనే విషయంలో పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని మెగా టోర్నీల కంటే ఫిఫా ప్రపంచకప్‌లో వచ్చే ప్రైజ్ మనీ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లో గెలిచిన విజేతకు రూ.341 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. రన్నరప్‌కు రూ.244 కోట్ల నగదు అందుతుంది. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.220 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.204 కోట్ల బహుమతి అందుతుంది.

Read Also: 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న సౌత్‌ స్టార్లు వీళ్లే..

అటు ఐదో స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లకు ప్రైజ్ మనీగా రూ.138 కోట్లు చొప్పున అందుతుంది. 9 నుంచి 16 స్థానం వరకు నిలిచిన జట్లకు రూ.105 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. 17 నుంచి 32 స్థానాల వరకు నిలిచిన టీమ్‌లకు రూ.73 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు. అయితే ఇంటర్నేషనల్ ప్రైజ్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత ఈ డబ్బు మొత్తం గెలిచిన జట్టు ఖాతాలో చేరుతుంది. ఆ తర్వాత స్క్వాడ్ మొత్తానికి ఈ నగదును పంపిణీ చేయడం జరుగుతుంది. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ను మొత్తం 440 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం ఖాయంలా కనిపిస్తోంది.

కాగా 1930-2018 వరకు ఫిఫా వరల్డ్ కప్ 21 సార్లు జరిగింది. అత్యధికంగా బ్రెజిల్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇటలీ, జర్మనీ దేశాలు నాలుగు సార్లు చొప్పున ఫిఫా టైటిల్‌ను గెలుపొందగా.. ఫ్రాన్స్, అర్జెంటీనా, ఉరుగ్వే దేశాలు రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ మాత్రం చెరొకసారి కప్పును తమ దేశానికి పట్టుకెళ్లాయి.