Fans Praising Rohit Sharma Innings In Bangladesh Match: అప్పటికే భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.. వీర బాదుడు బాదుతారనుకున్న బ్యాటర్లందరూ నిరాశాజనకమైన ప్రదర్శనతో పెవిలియన్ చేరారు.. చివర్లో ఛేదించాల్సిన పరుగులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ఎటు చూసినా పరిస్థితులు అనుకూలంగా కనిపించకపోవడంతో.. ఇక మ్యాచ్ ఏం చూద్దాంలే, భారత్ ఓటమి ఖాయమని అంతా ఫిక్సైపోయారు. అలాంటి సిట్యుయేషన్‌లో రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. అతని నుంచి కూడా పెద్ద అంచనాలేమీ లేవు. ఎందుకంటే, అతడు కొంతకాలం నుంచి పామ్‌లేమితో బాధపడుతున్నాడు. దీనికితోడు చేతికి గాయం అయ్యింది. దీంతో, ఇతడు కూడా త్వరగా పెవిలియన్ చేరుతాడని, భారత్ ఆలౌట్ అవ్వడం ఖాయమని భావించారు.
కానీ.. ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ హిట్-మ్యాన్ మెరుపులు మెరిపించాడు. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచే పరుగుల వర్షం కురిపించాడు. తన బాదుడుతో ఆ వన్డే మ్యాచ్‌ను ఒక్కసారిగా టీ20 మ్యాచ్‌లా మార్చేశాడు. అతని ఎడమ చేతి వేలికి గాయమైందన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా.. పూనకంతో మైదానంతో పరుగులు లంకించాడు. కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సులు, మూడు ఫోర్ల సహకారంతో 51 పరుగులు చేశాడు. రోహిత్ ఇలాంటి ఇన్నింగ్స్‌లను గతంలోనూ ఆడాడు కానీ, వాటన్నింటికన్నా ఇది పూర్తి భిన్నం. ఎందుకంటే.. చేతికి గాయమైనా, అది బాధిస్తున్నా, లెక్క చేయకుండా చెలరేగిపోవడమే అందుకు కారణం. ఏ స్థానంలో వచ్చామన్నది ముఖ్యం కాదు.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సత్తా చాటామా? లేదా? అన్నట్టుగా తన పోరాట పటిమను రోహిత్ ఈరోజు చూపించాడు.
రోహిత్ కొడుతున్న ఒక్కో షాట్‌కు.. మైదానంలో ఉన్న క్రీడాభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక యోధుడిలా జట్టుని విజయ తీరాలకు చేర్చేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు. అవును.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది కానీ, రోహిత్ మాత్రం గెలిచాడు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. ప్రత్యర్థి ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారంటే, అతని ఆటతీరు ఏ స్థాయిలో ఆకట్టుకుందో భావించొచ్చు. ఈ నేపథ్యంలోనే మన భారతీయ ప్రేక్షకులు రోహిత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇన్నాళ్లు రోహిత్ సాధించిన రికార్డులు ఒక ఎత్తు అయితే.. ఈ అర్థశతకం మరో ఎత్తు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.