NTV Telugu Site icon

BCCI: ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు?

Samson Tripathi

Samson Tripathi

దక్షిణాఫ్రికాతో జూన్‌లో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి గాను బీసీసీఐ సెలెక్షన్‌ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠిని, సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు, ఏ లెక్కన ఎంపిక చేయలేదని బిసీసీఐని నిలదీస్తున్నారు. మాజీలు సైతం ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయకపోవడంతో నిరాశను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అంతగా రాణించని రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌‌లను ఎంపిక చేయడంపై మండిపడుతున్నారు.

కాగా.. ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ 14 మ్యాచ్‌ల్లో 32.15 సగటు, 120.11 స్ట్రైక్‌రేట్‌‌తో 418 పరుగులు చేయగా, అందులో 3 అర్ధశతకాలు సాధించాడు. రుతురాజ్‌ 14 మ్యాచ్‌ల్లో 26.29 సగటు, 126.46 స్ట్రైక్‌రేట్‌‌తో 374 పరుగులు చేయగా, 3 అర్ధ శతకాలే సాధించాడు. వెంకటేశ్ అయ్యార్ అయితే ఈ సీజన్‌లో మరీ పేలవ పెర్పార్మెన్స్‌తో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌ల్లో 16.55 సగటు, 107.69 స్ట్రైక్‌రేట్‌తో 182 పరుగులే చేసిన వెంకటేశ్, ఒకటే అర్ధశతకం సాధించాడు. అయితే.. టీమిండియాకు ఎంపికవ్వని రాహుల్ త్రిపాఠి మాత్రం 14 మ్యాచ్‌ల్లో మెరుగైన 41.30 సగటు, 158.23 స్ట్రైక్‌రేట్‌ 413 పరుగులు సాధించాడు. అందులో 3 అర్ధశతకాలు కొట్టాడు. సంజూ శాంసన్‌ 14 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేయగా, రెండు అర్థశతకాలు నమోదు చేశాడు. సగటు 28.77 నామమాత్రంగా ఉన్నా, స్ట్రైక్‌రేట్‌ మాత్రం147.24 గొప్పగా ఉంది.

ఈ నేపథ్యంలోనే వాళ్ళను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ ప్రియులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ట్విటర్‌లో బీసీసీఐని ఎండగడుతున్నారు. అటు, రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేయకపోవడం నిరాశకు గురి చేస్తోందని హర్భజన్ ట్వీట్ చేయగా.. త్రిపాఠి, సంజూలను సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదని హర్ష భోగ్లే ట్వీటాడు. మరోవైపు.. టీమిండియా మాజీ బ్యాట్స్మన్, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా కూడా ఈ సెలక్షన్‌పై పెదవి విరిచాడు. ఐదుగురు ఫాస్ట్‌బౌలర్లు, నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం బాగానే ఉన్నా.. వారందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. దినేశ్‌పై సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తపరిచాడు.

Show comments