T20 World Cup Final 2022: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ నిలిచింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. సునాయాసమైన 138 పరుగుల టార్గెట్ ను ఆడుతూపాడుతూ అందుకుంది. 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 138 పరుగులును ఛేదించింది. ప్రపంచకప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మరో ఓవర్ ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులకే పరిమితం అయింది. సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, జోర్డాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ కు పరుగులు రావడమే కష్టం అయింది. ఆ జట్టులో కెప్టెన్ బాబర్ అజమ్, రిజ్వాన్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్ మినహా మిగతా వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
Read Also: Rajiv Gandhi assassination: “మా నాన్నను ఎందుకు చంపారు”.. ప్రియాంకాగాంధీ ఏడ్చారన్న నళిని
తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదట్లో తడబడింది. తొలి ఓవర్ లోనే షాహీన్ ఆఫ్రిది ఇంగ్లాండ్ ను దెబ్బతీశారు. ఓపెనర్ అలెక్స్ హేల్స్ ను ఔట్ చేశాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ జోస్ బట్లన్ పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే బెన్ స్టోక్స్ 52(49) రన్స్ చేసి చివరి వరకు క్రీజులో ఉండీ ఇంగ్లాండ్ ను గెలిపించాడు. హారీ బ్రూక్ 20(23), మొయిన్ అలీ 19(13) రన్స్ చేసి ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చారు. పాకిస్తాన్ బౌలర్లలో హారీస్ రౌఫ్ 2 వికెట్లు తీయగా.. షాహీన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీమ్ జూనియర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ తడబడుతూ ఆడింది. సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ లు పాకిస్తాన్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. సామ్ కర్రన్ 3 వికెట్లు తీయగా.. రషీద్, జోర్డాన్లు ఇద్దరు తలో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. పది ఓవర్ల వరకు 80 రన్స్ చేసి కేవలం 2 వికేట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఆ తరువాత వరస విరామాల్లో పాక్ వికెట్లను కోల్పోయింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 32(28) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ స్టార్ బ్యాటర్ రిజ్వాన్ కేవలం 15(14) వెనుదిరిగాడు. షాన్ మసూద్ ఒక్కడే చెప్పుకోదగిన విధంగా పోరాడాడు. మసూద్ 38(28) పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ 20(14) రన్స్ చేశాడు.
