NTV Telugu Site icon

Dinesh Karthik : ఛాన్స్ వస్తే.. ధోని మైండ్ లో ఏముందో చదివేస్తా..

Ms Dhoni Dinesh Karthik

Ms Dhoni Dinesh Karthik

టీమిండియా వెటరన్ వికెట్‌ కీపర్‌, బ్యాటర్ దినేశ్‌ కార్తీక్‌ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి ఎవ్వరు ఉహించని విధంగా పురాగమనం చేశాడు. IPL 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్‌, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసిన ఓ వీడియోలో దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. సరదాగా సమాధానాలిచ్చాడు. మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా? అని అడగ్గా.. ‘నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైండ్‌ను చదువుతా’ అని డీకే బదులిచ్చాడు.

టీ ఇష్టమా? లేదంటే కాఫీనా? అని అడిగితే.. తనకు టీ అంటేనే చాలా ఇష్టమని, భారత దేశంలో ఎక్కడకు వెళ్లినా కూడా మంచి టీ సులభంగా దొరుకుతుందని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. జట్టుతో డిన్నర్‌ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా? అని అడిగితే.. టీమ్‌ డిన్నర్‌ అంటేనే ఇష్టమని, ఆటగాళ్లతో భోజనం చేయడం చాలా బాగుంటుందన్నాడు. ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్‌ చేయడం ఇష్టమా? అడగ్గా.. చాలా కష్టమైన ప్రశ్న అని, తాను రెండింటిలో ఏదీ చేయలేను అని డీకే చెప్పాడు.

తనకు టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ అంటే చాలా ఇష్టమని, ఫుట్‌బాల్‌లో లియోనియల్ మెస్సీ ఆటతీరు బాగా నచ్చుతుందని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. తన జీవితంపై పుస్తకం కన్నాసినిమా వస్తే బాగుంటుందన్నాడు. వంట చేయడం కంటే ఇంటిని శుభ్రం చేయడానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ కంటే ట్విట్టర్ కే డీకే ఓటేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకేకు.. తొలి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. కేవలం రెండు బంతులే ఎదుర్కున్నాడు. బారాబటి స్టేడియంలో జరిగే రెండో టీ20 కోసం డీకే సన్నద్ధం అవుతున్నాడు.