క్రికెట్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. సిక్స్ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా ఎగిరి ఫీల్డర్లు క్యాచ్‌లు పట్టడం, సాధ్యం కాదనుకున్న ఫీట్స్ సాధించడం.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో! ఇప్పుడు తాజాగా మరో నమ్మశక్యం కాని పరిణామం చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా వికెట్ కీపర్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకొని, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్ మధ్య మ్యాచ్‌లో భాగంగా 98 పరుగుల ఆధిక్యంతో కర్ణాటక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 33 పరుగుల వద్ద రవికుమార్ సమ్రాట్ రూపంలో ఈ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 12వ ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. సౌరబ్ కుమార్ బౌలింగ్‌లో అతను ముందుకొచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, బంతి స్వింగ్ అవ్వడంతో బ్యాట్ ఎడ్జ్‌ను తాకింది. దాంతో అది గాల్లోకి లేచి, కీపర్ ద్రువ్ జురేల్ దిశగా దూసుకెళ్లింది. బ్యాట్స్మన్ ముందుకెళ్లడంతో స్టంప్ ఔట్ చేయాలన్న మూమెంట్‌లో కీపర్ ఉన్నాడు. ఎవరైనా ఆ పరిస్థితిని గమనిస్తే, కీపర్‌కి క్యాచ్ దొరకదనే అనుకుంటారు.
కానీ.. ఎవరూ ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ని పైకి లేపడంతో, బంతి చేతికి చిక్కింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదూ.. స్వయంగా కీపర్ కూడా ఆశ్చర్యపోయాడు. ‘ఏంటీ.. నేను క్యాచ్ పట్టానా?’ అంటూ కొన్ని క్షణాలు అలాగే నిల్చుండిపోయాడు. ఓవైపు వికెట్ పడిందని తోటి ఆటగాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటే, కీపర్ మాత్రం ఇంకా షాక్‌లోనే ఉండిపోయాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి