Devdutt Padikkal: దేవదత్‌ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!

Devdutt Padikkal Rare Test Record

Devdutt Padikkal Rare Test Record

Devdutt Padikkal Rare Test Record: టీమిండియా యువ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో మూడో స్థానంలో 200కు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్లలో మూడో ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రాణించడంతో పడిక్కల్‌ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 230 బంతుల్లో 167 పరుగులు చేసిన పడిక్కల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 75 బంతుల్లో 44 రన్స్ చేశాడు. గాలె టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 211 పరుగులు చేశాడు.

భారత మాజీ టెస్టు బ్యాటర్‌, నయా వాల్ చతేశ్వర్‌ పుజారా కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాడు. అలాంటిది దేవదత్‌ పడిక్కల్‌ కెరీర్ ఆరంభంలోనే ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. విదేశీ గడ్డపై టెస్టులో నంబర్‌-3 స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ద్రవిడ్‌ ఏకంగా ఐదుసార్లు ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇప్పుడు ఈ రికార్డు పడిక్కల్‌ టెస్టు కెరీర్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సాయి సుదర్శన్‌ దూరం కావడంతో దేవదత్‌ పడిక్కల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతడు అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. గాలె టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ (167) చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక రన్స్ చేసి టెస్టు జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. తన మూడో టెస్టులోనే తొలి సెంచరీ సాధించిన పడిక్కల్‌.. విదేశీ టెస్టులో నంబర్‌-3 స్థానంలో 150కు పైగా పరుగులు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ప్రస్తుతం శ్రీలంకతో తొలి టెస్టులో పడిక్కల్‌ ప్రదర్శన భారత జట్టుకు మాత్రమే కాకుండా అతడి వ్యక్తిగత కెరీర్‌కు కూడా కీలకంగా మారింది. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ఈ ఘనతను అందుకోలేకపోవడం విశేషం.