ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5), ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (0) త్వరత్వరగా ఔట్ కావడంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా 24 పరుగులతో కాసేపు నిలబడ్డాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌ల తర్వాత పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అటు కెప్టెన్ పంత్ (39), పావెల్(43) రాణించడంతో ఢిల్లీ 150 పరుగులకు పైగా స్కోరు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు సాధించాడు. రమణ్‌దీప్‌సింగ్ 2 వికెట్లు తీయగా.. డానియల్ శామ్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
