T20 Worldcup 2022: టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకోగా తాజాగా రిజర్వు ఆటగాడిగా ఎంపికైన ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా వైదొలిగాడు. అతడు కొద్దిరోజులుగా బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే బుమ్రా లేని నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దీపక్ చాహర్ వెళ్తాడని అందరూ భావించారు. ప్రపంచకప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే నాటికి అతడు కోలుకుంటాడని ఆకాంక్షించారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి తరహాలో ఆస్ట్రేలియా వెళ్లకుండానే దీపక్ చాహర్ టోర్నీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also: Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!
టీ20 స్పెషలిస్టుగా ముద్ర వేసుకున్న దీపక్ చాహర్‌ను రిజర్వు ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే బుమ్రా గాయపడిన నేపథ్యంలో అతడిని ప్రధాన జట్టులోకి తీసుకుంటారని అందరూ ఊహించారు. కానీ గాయం కారణంగా దీపక్ చాహర్ వైదొలగడంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రాణించిన శార్దూల్ ఠాకూర్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అతడు త్వరలో ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతోన్నాడు. ప్రస్తుతం పెర్త్‌లో ఉంటున్న టీమిండియా జట్టును కలవబోతోన్నాడు. శార్దూల్ ఠాకూర్‌తో పాటు వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమైంది. బుమ్రా స్థానంలో షమీని సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బెంగళూరులోని ఎన్‌సీఏలో షమీ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. కాగా ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
