Dean Elgar Retirement: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ టెస్టు ఓపెనర్ డీన్ ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎల్గర్.. ఆ తర్వాత దేశవాళీ, కౌంటీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్ ముగిసిన తర్వాత పూర్తిగా ఆట నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 39 ఏళ్ల ఎల్గర్ తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలిపాడు. క్రికెట్ కెరీర్‌లో ఇక ముందుకు సాగడం కంటే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, తన భాగస్వామి, పిల్లలతో ఉండటం ప్రస్తుతం తనకు ముఖ్యమని చెప్పాడు.
‘నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. నాకు 39 ఏళ్లు వచ్చాయి. ఇంటి వద్ద ఎదుగుతున్న నా పిల్లలతో పాటు కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. నా భాగస్వామి, పిల్లలతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నా క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. అయితే ఇది ఇంకా పూర్తికాలేదు. కౌంటీ ఛాంపియన్‌షిప్ ఈ సీజన్ ముగిసిన తర్వాత నేను రిటైర్ అవుతాను’ అని ఎల్గర్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా తరఫున ఎల్గర్ 12 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో జట్టుకు నమ్మకమైన ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు. 86 టెస్టుల్లో 5,347 పరుగులు చేసిన ఎల్గర్.. 37.92 సగటుతో రన్స్ చేశాడు. అతడి ఖాతాలో 14 సెంచరీలు ఉన్నాయి. 2017లో బంగ్లాదేశ్‌పై చేసిన 199 పరుగులు అతడి కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా కూడా ఎల్గర్ బాధ్యతలు నిర్వహించాడు. 2022లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా సాధించిన టెస్టు విజయం అతడి కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాల్లో ఒకటి. కెప్టెన్‌గా ఉన్న సమయంలో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని ఎల్గర్ చెప్పాడు.
తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే సమయానికి దక్షిణాఫ్రికా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉందని, తన పదవీకాలం ముగిసే సమయానికి రెండో స్థానానికి చేరుకుందని డీన్ ఎల్గర్ గుర్తు చేసుకున్నాడు. తనకు క్రికెట్‌లో ఛాన్స్ వస్తుందని చాలామంది ఊహించలేదని, రెండు దశాబ్దాలకు పైగా ఆటను కొనసాగించడం తనకు ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నాడు. ఇక ఎల్గర్ పేరు భారత క్రికెట్ అభిమానులకు మరో కారణంతోనూ గుర్తుండిపోతుంది. 2022లో భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా డీఆర్‌ఎస్ నిర్ణయం విషయంలో ఎల్గర్, అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఉద్రిక్తత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

