CSK Offers Rs 10 Crore + 2 Dube And Brevis for Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చుట్టూ ట్రేడ్ ఊహాగానాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను తమ జట్టులోకి తీసుకోవడానికి ఏకంగా ఏడు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 32 ఏళ్ల హార్దిక్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బాగా ప్రయత్నిస్తోందని, అందుకోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ట్రేడ్ కోసం ముంబై భారీ ప్రతిఫలం కోరుతుండగా.. సీఎస్‌కే కూడా బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచినట్లు సమాచారం.
రూ.20 కోట్లకు పైగానే:
హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేయాలంటే సీఎస్‌కే యువ సంచలనం ఆయుష్ మత్రేతో పాటు భారీగా నగదు ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కోరినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అయితే ఆయుష్ మత్రేను వదులుకోవడానికి సీఎస్‌కే యాజమాన్యం సిద్ధంగా లేదని సమాచారం. అతడిని జట్టు భవిష్యత్తుకు కీలక ఆటగాడిగా భావిస్తున్న నేపథ్యంలో ట్రేడ్‌లో చేర్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. సీఎస్‌కే మరో భారీ ఆఫర్‌ను ముంబై ముందుంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబేతో పాటు దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్‌ను ఇవ్వడమే కాకుండా.. అదనంగా రూ.10 కోట్ల నగదు కూడా చెల్లించేందుకు సీఎస్‌కే సిద్ధమైందని సదరు నివేదిక పేర్కొంది. ఈ ప్రతిపాదన మొత్తం విలువ రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఐపీఎల్ 2026 సీజన్‌లో విఫలం:
హార్దిక్ పాండ్య ఇప్పటికీ భారత క్రికెట్‌లో అత్యంత విలువైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడి ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఆ సీజన్‌లో హార్దిక్ 206 పరుగులు మాత్రమే చేసి, నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే సీఎస్‌కే మాత్రం హార్దిక్‌పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందట. అతడి గత ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఆఫర్ ఇస్తోందా? లేక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుందా? అనే చర్చ నెట్టింట జోరుగా జరుగుతోంది.
హార్దిక్ పాండ్యపై కోల్‌కతా కూడా ఆసక్తి:
ఇప్పటివరకు ఈ ట్రేడ్‌పై అటు సీఎస్‌కే లేదా ఇటు ముంబై ఇండియన్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. మరోవైపు ఇరు జట్ల మధ్య చర్చలు విఫలమైతే.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా హార్దిక్ పాండ్యను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఉందట. అందుకే ప్రస్తుత పరిస్థితిని కేకేఆర్ గమనిస్తోందట. కోల్‌కతాకు సరైన కెప్టెన్ అవసరం ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి హార్దిక్ ట్రేడ్ వ్యవహారం ఐపీఎల్ 2027కు ముందు అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

