CSK Former Bowler Ishwar Pandey Comments On MS Dhoni: భారత జట్టుకు నాయకత్వం వహించినంత కాలం మహేంద్ర సింగ్ ధోనీ ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. అతని వల్లే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలన్న యువ ఆటగాళ్ల కల నెరవేరింది. ధోనీ ప్రోత్సాహంతోనే వాళ్లు తమ తలరాతని మార్చుకోగలిగారని చెప్పుకోవడంలో సందేహమే లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సైతం ఆ జాబితాలోకే వస్తారు. కానీ, ఒక్క ఆటగాడు మాత్రం తనకు ధోనీ అవకాశం ఇవ్వకపోవడం వల్లే భారత జట్టుకి ఆడాలన్న తన కల నెరవేరలేదని బాంబ్ పేల్చాడు. ఆ ఆటగాడి పేరు ఈశ్వర్ పాండే (33). ఇతడొక ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు తరఫున ఆడాడు. అంతేకాదు.. ధోనీ ముందుండి నడిపించిన ఫునె సూపర్‌జెయింట్స్, పూణె సూపర్ వారియర్స్ జట్లలో కూడా అతడు భాగస్వామయ్యాడు.
ఐపీఎల్‌లో కెరీర్‌లో మొత్తం 25 మ్యాచ్‌లు ఆడిన ఈశ్వర్.. కేవలం 18 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ.. ఫస్ట్ క్లాస్‌లో మాత్రం ఇతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 75 మ్యాచెస్‌లో మొత్తం 263 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలని ఎంతో శ్రమించాడు కానీ, అతని కల కలగానే నెరవేరింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా, తనకు అవకాశం రాకపోవడంతో చివరికి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే.. భారత్ తరఫున ఆడాలన్న తన చిరకాల కోరిక నెరవేరకుండానే భారమైన హృదయంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన ఇతను.. ధోనీ తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే, ఈరోజు తన కెరీర్ మరో విధంగా ఉండేదని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
‘‘ఒకవేళ ధోనీ నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటే, నా కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేది. అప్పుడు నా వయసు 23-24 ఏళ్లు ఉండేది. చాలా ఫిట్‌గా కూడా ఉన్నాను. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ కోసం చాలా పరితపించాను. ఎడతెరిపి లేకుండా శ్రమించాను. కానీ, నాకు ఛాన్స్ రాలేదు. ఆరోజు ధోనీ భాయ్ నాకు అవకాశం ఇచ్చుంటే, నా దేశం కోసం ఆడే అదృష్టం లభించేది. కచ్ఛితంగా నన్ను నేను నిరూపించుకునేవాడ్ని. కానీ, అప్పుడు ఛాన్స్ రాకపోవడం వల్ల నా కల కలగానే మిగిలింది’’ అని ఈశ్వర్ చెప్పుకొచ్చాడు. అయితే.. ధోనీ, స్టీఫెన్ ఫ్లిమంగ్ మార్గదర్శకంలో సీఎస్కే తరఫున ఆడటం తనకు సంతృప్తి ఇచ్చిందని ఈశ్వర్ చివర్లో పేర్కొనడం గమనార్హం.
