Site icon NTV Telugu

Common Wealth Games 2022: నేటి నుంచి ఆటలు ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే..!!

India

India

Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆరంభ వేడుక గురువారం అట్టహాసంగా ముగిసింది. శుక్రవారం నుంచి ఆటల పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆరంభ వేడుకలను ఆస్వాదించిన క్రీడాకారులు రెండో రోజు నుంచి కదన రంగంలోకి దిగనున్నారు. ఈరోజు నుంచి 11 రోజుల పాటు క్రీడాభిమానులకు వినోదం అందించనున్నారు. తొలిరోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో అడుగుపెడుతున్న క్రికెట్‌లో తొలి మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మేరకు సాయంత్రం 4:30 గంటలకు భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

Read Also: IND Vs WI: నేటి నుంచి రోహిత్ సారథ్యంలో ఐదు టీ20ల సిరీస్.. అశ్విన్ ఆడతాడా?

మరోవైపు భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో ఘనాతో పోటీ పడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌లో తేలిపోయింది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. అటు బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కూడిన భారత బృందం మిక్స్‌డ్ టీం విభాగంలో పాకిస్థాన్‌తో తొలి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో పురుషులు, మహిళల టీమ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ జరగనుంది. బాక్సింగ్ విభాగంలో శివ థాపా, సుమిత్, రోహిత్, ఆశిష్ తొలి రౌండ్‌లో తలపడనున్నారు. స్క్వాష్‌లో మహిళలు, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా ట్రయథ్లాన్, స్విమ్మింగ్, లాన్‌బౌన్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాగా బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు బర్మింగ్‌హామ్ చేరుకోగానే నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. మిగతావారందరికీ నెగటివ్ రాగా స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఫలితం మాత్రం కాస్త అటూఇటూగా వచ్చింది. ఫలితం అనుమానంగా ఉండడంతో రెండో టెస్టు ఫలితం వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సింధుకు సూచించారు. ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్టు భారత అధికారులు తెలిపారు. అయితే రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సింధుకు నెగటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది.

Exit mobile version