NTV Telugu Site icon

Beijing Olympics: ఆ మంచు కోసం చైనా ఎంత ఖ‌ర్చు చేసిందో తెలుసా…!!?

ప్ర‌స్తుతం బీజింగ్‌లో వింట‌ర్ ఒలింపిక్స్ 2022 జ‌రుగుతున్న‌ది. శీతాకాలంలో నిర్వ‌హించే వింట‌ర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవ‌స‌రం అవుతుంది. స‌హ‌జ‌సిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింట‌ర్ ఒలింపిక్స్‌ను నిర్వ‌హించాలి అంటే సాధ్యం కాదు. స‌హ‌జ‌సిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్న‌ప్ప‌టికీ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏ మాత్రం స‌రిపోదు. దీనికోస‌మే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 ద‌శ‌కం నుంచి వింట‌ర్ ఒలింపిక్స్ కోసం కొంత‌మేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గ‌తంలో ర‌ష్యాలోని సోచీలో నిర్వ‌హించిన వింట‌ర్ ఒలింపిక్స్‌కోసం 80 శాతం కృత్రిమ మంచును వినియోగించ‌గా, ద‌క్షిణ‌కొరియాలో జ‌రిగిన వింట‌ర్ ఒలింపిక్స్ కోసం 98శాతం కృత్రిమ మంచును వినియోగించారు. అయితే, బీజింగ్ లో జరుగుతున్న ఒలింపిక్స్ కోసం 100 శాతం కృత్రిమ మంచును విన‌యోగించారు. ఇట‌లీకి చెందిన టెక్నోఆల్సిన్ కంపెనీకి కాంట్రాక్ట్ ప‌నుల‌ను అప్ప‌గించారు. బీజింగ్ ఒలింపిక్స్ కోసం ఇట‌లీకి చెందిన టెక్నో ఆల్సిన్స్ కంపెనీ 2018 నుంచి ప‌నుల‌ను ప్రారంభించింది. ఒలింపిక్స్ క్రీడ‌ల కోసం కృత్రిమ మంచును త‌యారు చేసేందుకు సుమారు 49 మిలియ‌న్ గ్యాలన్ల నీటిని వినియోగించారు.

Read: Birds Man: ప‌క్షుల కోసం 2.5 ల‌క్ష‌ల గూళ్ల‌ను త‌యారు చేశాడు..

అంటే ఈ నీటితో సుమారు 10 కోట్ల మందికి కొన్ని రోజుల‌పాటు తాగునీరు అందించ‌వ‌చ్చు. బీజింగ్ వింట‌ర్ ఒలింపిక్స్‌లో 8 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు మీట‌ర్ల‌లో క్రీడ‌ల‌ను నిర్వ‌హించేందుకు 12 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మంచు అవ‌స‌రం అవుతుంద‌ని గుర్తించారు. 272 ప్రొఫెల్ల‌ర్ డ్రివెన్ ఫ్యాన్ గ‌న్లు, 82 లాన్స్ స్టైల్ గ‌న్లు వినియోగించి ఈ మంచును త‌యారు చేశారు. ఈ కృత్రిమ మంచు త‌యారీ కోస‌మే చైనా ఏకంగా 60 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చుచేసింది. బీజింగ్ ఒలింపిక్స్ కోసం 49 మిలియ‌న్ గ్యాల‌న్ల నీటిని వినియోగించ‌డంతో బీజింగ్‌లో నీటి కొర‌త ఏర్ప‌డింది. ఈ న‌గ‌రంలో నివ‌శిస్తున్న 2.1 కోట్ల మంది ప్ర‌జ‌లు తాగునీటికోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతేకాదు, మియూన్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి నీటిని పెద్ద ఎత్తున మ‌ళ్లించ‌డంతో సాగునీటి కొర‌త ఏర్ప‌డింది. సాగునీటి కొర‌త ఏర్ప‌డంతో రైతులు వ్య‌వ‌సాయాన్ని ప‌క్క‌న పెట్టి ప‌నుల కోసం వ‌ల‌స వెళ్లార‌ని అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.