NTV Telugu Site icon

పుజారా పేరిట చెత్త రికార్డ్…

భారత జట్టులోని టెస్ట్ స్పెషలిస్ట్ అలాగే నయా వాల్ గా పేరొందిన పుజారా ఈ మధ్య అనుకున్న విధంగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో కాన్పూర్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కూడా పుజారా విఫలమయ్యాడు. ఇక ఇదే సమయంలో ఓ చెత్త రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్ లలో ఆడిన ఆటగాడిగా చెత్త రికార్డ్ నెలకొల్పాడు.

పుజారా సెంచరీ చేయకుండా 39 ఇన్నింగ్స్ లు ఆడాడు. గతంలో భారత మాజీ కెప్టెన్ వాడేకర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 1968 మరియు 1974 సంవత్సరాల మధ్య 39 ఇన్నింగ్స్‌ లు వంద పరుగులు చేయకుండానే బ్యాటింగ్ చేసారు. ఇప్పుడు ఆ చెత్త రికార్డును పుజారా సమం చేసాడు. పుజారా తన చివరి సెంచరీని 2019లో చేయడంతో.. అప్పటి నుండి ఇప్పటివరకు సెంచరీ లేకుండానే 39 ఇన్నింగ్స్‌లను పూర్తి చేశాడు. ఇక 2013 నుండి 2016 వరకు కూడా పుజారా ఇలానే 37 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు.