దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు భారత్ మంచి స్కోరు చేసింది.
Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
అయితే ఫస్ట్ డౌన్‌లో వచ్చిన పుజారా గోల్డెన్ డకౌట్ కాగా కెప్టెన్ కోహ్లీ 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో అయినా సెంచరీ దాహం తీరుస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. కోహ్లీ సెంచరీ కోసం సెకండ్ ఇన్నింగ్స్ వరకు వెయిట్ చేయాలి. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. కాగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్‌తో పాటు మరో సీనియర్ ఆటగాడు ఆజింక్యా రహానె (40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
