NTV Telugu Site icon

IND Vs ENG: పాపం బ్రాడ్.. అప్పుడు యువరాజ్.. ఇప్పుడు బుమ్రా.. చితక్కొట్టేశారు

Bumrah

Bumrah

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను చూస్తే పాపం అని టీమిండియా అభిమానులు అనక మానరు. ఎందుకంటే గతంలో టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి అతడికి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పటికీ ఆ ఓవర్‌ను అటు ఇంగ్లండ్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. తాజాగా బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ బౌలింగ్‌లోనే ఒకే ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే కావడం విశేషం. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 84వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన బ్రాడ్‌ను బుమ్రా చితక్కొట్టేశాడు.

Read Also: IND Vs ENG: పంత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన టీమిండియా

బ్రాడ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి బుమ్రా ఫోర్ కొట్టగా, రెండో బంతికి వైడ్, నాలుగు బైస్ తో కలిపి 5 పరుగులు లభించాయి. ఆ తర్వాత మూడో బంతిని బ్రాడ్ నోబాల్ వేయగా బుమ్రా దాన్ని సిక్స్ గా మలిచాడు. బుమ్రా ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇక చివరి బంతికి సింగిల్ రన్ తీయడంతో ఈ ఓవర్లో మొత్తంగా 35 పరుగులు లభించాయి. గతంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం లారా, ఆస్ట్రేలియా ఆటగాడు బెయిలీ, దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్ పేరిట ఉంది. 2003లో లారా దక్షిణాఫ్రికా బౌలర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో 28 పరుగులు సాధించాడు. 2013లో జార్జ్ బెయిలీ ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌లో 28 పరుగులు చేశాడు. 2020లో కేశవ్ మహారాజ్ ఇంగ్లండ్ బౌలర్ రూట్ బౌలింగ్‌లో 28 పరుగులు సాధించాడు. ఇప్పుడు బుమ్రా 35 పరుగులు చేసి వీరందరి రికార్డును కొల్లగొట్టేశాడు.