Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?

Bhuvneshwar Kumar Ajit Agarkar

Bhuvneshwar Kumar Ajit Agarkar

Bhuvneshwar Kumar Comeback: భారత క్రికెట్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో 36 ఏళ్ల భువీకి చోటు దక్కింది. అయితే అతడి పునరాగమనం వెనుక ఆసక్తికరమైన సెలెక్షన్ కథ ఉంది. ముఖ్యంగా మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన హయాంలో సీనియర్ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడంపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.

భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022లో న్యూజిలాండ్‌పైనే టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో తన సత్తా చాటుతూ వచ్చాడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో భువీ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 17 వికెట్లు పడగొట్టిన అతడు పవర్‌ప్లేలో స్వింగ్, సీమ్‌తో అత్యుత్తమ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. భువనేశ్వర్‌ను తిరిగి టీమిండియాలోకి తీసుకురావాలనే ప్రయత్నాలకు అప్పటి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అడ్డుపడ్డాడట. సీనియర్ ఆటగాళ్ల కంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడంపైనే సెలెక్షన్ కమిటీ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

భువనేశ్వర్ ఎంపికకు సెంట్రల్ జోన్ సెలెక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్ మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ సమయంలో ఆయన ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు. అయితే అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మిగతా సెలెక్టర్లను ఒప్పించడం ఈజీగా మారింది. భారత టీ20 జట్టులో భువనేశ్వర్ పునరాగమనానికి మరో కారణం జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడమేన. భువీకి అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు కొత్త తరం పేసర్లకు మార్గదర్శకంగా కూడా ఉపయోగపడనున్నాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ పేసర్లను 2028 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని టీమిండియా చూస్తోంది. భువనేశ్వర్ తన అనుభవంతో వీరికి సూచనలు, సలహాలు ఇవ్వగలడని సెలెక్టర్లు భావించినట్లు సమాచారం.

భువనేశ్వర్ ఇప్పటివరకు భారత్ తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి ఖాతాలో 90 వికెట్లు ఉన్నాయి. కొత్త బంతితో స్వింగ్ చేయడంలో అతడికి ఉన్న ప్రత్యేక నైపుణ్యం, డెత్ ఓవర్లలో అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడే అవకాశముంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు తమ స్థానాలను దాదాపుగా ఖాయం చేసుకున్నవారే. అయితే భువనేశ్వర్ పునరాగమనం మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ప్రేరణగా మారవచ్చు. సీనియర్ ఆటగాళ్లకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదనే సంకేతాన్ని భువీ రీఎంట్రీ ఇచ్చింది. అగార్కర్ తర్వాత ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రకటించిన తొలి టీ20 జట్టు ఇదే కావడం కూడా ప్రత్యేకతగా నిలిచింది.

నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రావడం కేవలం అతడి ఐపీఎల్ ప్రదర్శనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదు. సెలెక్షన్ కమిటీ మార్పు, బుమ్రా అందుబాటులో లేకపోవడం, యువ పేసర్లకు మార్గదర్శకత్వం అవసరం వంటి అంశాలు కూడా అతడి రీఎంట్రీకి కారణాలుగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఐదు టీ20లు ఆడనుంది. తొలి రెండు మ్యాచ్‌లు అక్టోబర్ 22, 24 తేదీల్లో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతాయి. మూడో టీ20 అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో, నాలుగో మ్యాచ్ అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో, ఐదో టీ20 నవంబర్ 1న హామిల్టన్‌లో జరగనుంది. టీ20 సిరీస్ అనంతరం భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేలు, రెండు టెస్టులు కూడా జరగనున్నాయి.