టీమిండియా ఓటమి చవిచూసినప్పుడల్లా.. కెప్టెన్లపై విమర్శలు వెల్లువెత్తడం సర్వసాధారణం. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, కెప్టెన్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓటమి చవిచూసిందంటూ కొందరు కావాలనే విమర్శలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు రిషభ్ పంత్‌పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. రిషభ్ నాయకత్వంలో భారత్ 211 పరుగులు కొట్టినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాల్వడంతో అతడ్ని విమర్శిస్తున్నారు. జట్టును నడిపించేంత సామర్థ్యం అతనికి లేదని, ఎవరైనా సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే రిషభ్‌కు మద్దతుగా భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ‘‘రిషభ్‌కి ఇది కెప్టెన్‌గా తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఈ సిరీస్‌లో రానున్న మ్యాచ్‌ల్లో అతడు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడు. కెప్టెన్ ఒక్కడే సరిగ్గా ఉంటే సరిపోదు.. జట్టు మొత్తం రాణిస్తేనే విజయం సాధిస్తాం. తొలి మ్యాచ్‌లో మా బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరిచింది. ఒకవేళ మేము బౌలింగ్ బాగా వేసి, జట్టుని గెలిపించుంటే.. అందరూ పంత్ నిర్ణయాత్మక నైపుణ్యాలను ప్రశంసించేవారుగా!’’ అంటూ విమర్శకులకు భువి చురకలంటించాడు. కాగా.. తదుపరి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తారని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా.. తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించగా.. ఇతర బ్యాట్స్మన్లందరూ బాగానే రాణించారు. ఇక 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడు వికెట్ల నష్టానికి 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. డేవిడ్ మిల్లర్, డసెన్ అద్భుతంగా రాణించడంతో.. సౌతాఫ్రికా అలవోకగా విజయం సాధించింది.