Ben Stokes in IPL 2027 Auction: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2027 వేలంకు సిద్దమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలం కోసం స్టోక్స్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అతడు రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున కూడా స్టోక్స్ ఆడనున్నాడు.
స్టోక్స్‌కు ప్రత్యేక అనుమతి:
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మెగా వేలానికి దూరంగా ఉన్న ఆటగాడు అదే వేలం చక్రంలో జరిగే మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడానికి వీలుండదు. అయితే బెన్ స్టోక్స్‌కు ఈసారి వేలంలో పాల్గొనేందుకు ప్రత్యేక అనుమతి లభించినట్లు క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. దీంతో బీసీసీఐ నిబంధనల మధ్య స్టోక్స్ వేలంలోకి ఎలా వచ్చాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. స్టోక్స్ చాలా కాలంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2022 చివర్లో ఇంగ్లండ్ తరఫున చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అయినప్పటికీ కెప్టెన్సీ అనుభవం, మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్‌రౌండ్ ప్రతిభ కారణంగా ఈసారి వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
2017లో అత్యంత విలువైన ఆటగాడిగా:
ఐపీఎల్‌లో 2017 సీజన్ బెన్ స్టోక్స్‌కు మరుపురానిది అని చెప్పాలి. ఆ ఏడాది రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడిన అతడు 316 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడు అవార్డును అందుకున్నాడు. ఆ సీజన్‌లో పుణె ఫైనల్‌కు కూడా చేరింది. ఆ తర్వాత నాలుగు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫున మొత్తం 31 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మరో రెండు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో అతడి అనుభవం, గత ప్రదర్శనలు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. ఈసారి వేలంలో బెన్ స్టోక్స్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
వేలానికి 11 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2027 వేలం కోసం 11 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ జాబితాలో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పేర్లు లేవని సమాచారం. ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందిన ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడట.

