ECB Considers Complete Alcohol Ban After Ben Stokes Controversy: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఇంగ్లండ్ మేన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో మద్యం వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన అనంతరం స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్‌లు అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో.. వారిద్దరినీ రెండో టెస్ట్‌కు ఎంపిక చేయలేదు. ఈ ఘటన ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
మళ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడా?:
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాబ్ కీ.. బెన్ స్టోక్స్ మళ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడా అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం చెప్పలేమని తెలిపాడు. జట్టుకు, స్టోక్స్‌కు ఏది మంచిదో ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన భావోద్వేగాల నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని వ్యాఖ్యానించాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. కొన్ని రోజులకు పరిస్థితులను సమీక్షించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం’ అని రాబ్ కీ వెల్లడించాడు.
కెప్టెన్సీ నుంచి తొలగించే ఆలోచన ఉందా?:
బెన్ స్టోక్స్‌ను పూర్తిగా కెప్టెన్సీ నుంచి తొలగించే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు రాబ్ కీ స్పందిస్తూ.. ప్రస్తుతం తాము ఏదీ ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ మార్పు గురించి బోర్డులో ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టులో క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆటగాళ్లు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు బయట తిరగడం సరైంది కాదని చెప్పాడు. ఆటగాళ్లు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని, ప్రస్తుతం ఆ విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించాడు.
అవమానంగా చూడటం సరికాదు:
అయితే బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ జోడీపై వచ్చే విమర్శలను రాబ్ కీ ఖండించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్-కెప్టెన్ భాగస్వామ్యాల్లో వీరిద్దరూ ఒకరని కొనియాడాడు. ఈ ఒక్క ఘటనతో వారిని అవమానంగా చూడటం సరికాదని స్పష్టం చేశాడు. ఇక రెండో టెస్ట్‌కు తాత్కాలికంగా జో రూట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయంపై కూడా రాబ్ కీ స్పందించాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను కాకుండా రూట్‌ను ఎంపిక చేయడానికి కారణం జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉండటమేనని తెలిపాడు. ‘ఇంగ్లండ్ క్రికెట్ కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని గట్టెక్కించే వ్యక్తి జో రూట్. మైదానంలోనూ, మైదానం బయటా అతను నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అడిగిన వెంటనే ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించాడు’ అని రాబ్ కీ వెల్లడించాడు.

