VVS Laxman BCCI: భారత క్రికెట్‌లో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్వహించే ప్రతి సమావేశానికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరు కానున్నారు. ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్లకు సంబంధించిన సమాచారం సెలెక్టర్లకు సకాలంలో, కచ్చితంగా అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
ఇటీవల గువాహటిలో జరిగిన టీ20, ఇండియా-ఏ జట్టు ఎంపిక సమావేశాల్లోనూ హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇకపై సీనియర్ జట్టు సెలెక్షన్ ప్రక్రియలోనూ ఆయన క్రమం తప్పకుండా భాగం కానున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలు, రిహాబిలిటేషన్ వంటి అంశాలను పర్యవేక్షించే వ్యవస్థకు లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో.. సెలెక్టర్లతో ఆయన నేరుగా సమన్వయం చేసుకోవడం వల్ల ఎంపిక ప్రక్రియ మరింత మెరుగుపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.
మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెలెక్షన్ కమిటీ మధ్య కమ్యూనికేషన్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తారు?, వారి ఫిట్‌నెస్ పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలపై సెలెక్టర్లకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందకపోయిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై సెలెక్షన్ సమావేశాల్లోనే లక్ష్మణ్ అందుబాటులో ఉంటే.. ఆటగాళ్ల ఫిట్‌నెస్, రిహాబిలిటేషన్, గాయాల పరిస్థితిపై సెలెక్టర్లు నేరుగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా జట్టు ఎంపిక సమయంలో ఎలాంటి అపోహలు లేదా సమాచార లోపాలు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ నిర్ణయంపై స్పష్టత ఇచ్చారు. ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై సీఓఈ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. అన్ని సీనియర్ సెలెక్షన్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సెలెక్టర్లకు కచ్చితమైన సమాచారం అందించడం, కమ్యూనికేషన్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చూడటమే ఈ మార్పు ఉద్దేశమని తెలిపారు. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాజీ భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మార్పుల నేపథ్యంలోనే బీసీసీఐ సెలెక్షన్ ప్రక్రియలోనూ కొన్ని కీలక మార్పులు చేస్తోంది. లక్ష్మణ్‌కు సెలెక్షన్ సమావేశాల్లో మరింత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య సమన్వయం పెరగనుంది.

