BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!

Bcci Umpire Fee Hike

Bcci Umpire Fee Hike

BCCI Umpires Fee Hike: భారత క్రికెట్‌లో అంపైర్లకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు అంపైర్ల పనితీరును బట్టి ప్రమోషన్, డిమోషన్ ఇచ్చే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. 2017-18 సీజన్‌ నుంచి దాదాపు పదేళ్లుగా అంపైర్ల ఫీజుల్లో ఎలాంటి మార్పు లేదని సైకియా తెలిపారు. తాజాగా అంపైర్ల కేటగిరీలను పునర్వ్యవస్థీకరించి.. వారి రోజువారీ ఫీజులను గణనీయంగా పెంచినట్లు చెప్పారు. గతంలో నాలుగు కేటగిరీలు ఉండగా.. వాటిని A, B, C, Dగా పునర్వ్యవస్థీకరించినట్లు వివరించారు. మ్యాచ్ రిఫరీల ఫీజు, నిర్మాణాన్ని కూడా సవరించినట్లు ఆయన తెలిపారు.

కొత్త విధానం ప్రకారం.. దేశవాళీ క్రికెట్‌లో అంపైర్లకు కేటగిరీని బట్టి రోజుకు రూ.60,000, రూ.50,000, రూ.40,000, రూ.35,000 చెల్లించనున్నారు. గతంలో సీనియర్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్లకు ఉన్నత రెండు కేటగిరీలకు రోజుకు రూ.40,000, రూ.30,000గా ఉండేది. టీ20 మ్యాచ్‌లకు రూ.20,000 చెల్లించేవారు. తాజా నిర్ణయంతో వారి పారితోషికం గణనీయంగా పెరగనుంది. అంపైర్ల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు బీసీసీఐ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. అంపైర్స్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అంపైర్ల పనితీరును అంచనా వేయనుంది. ఆ అంచనాల ఆధారంగానే దేశవాళీ క్రికెట్‌లో వారికి మ్యాచ్‌లను కేటాయించనున్నారు.

ప్రతి సీజన్‌ ముగిసిన తర్వాత అంపైర్లకు ప్రమోషన్ లేదా డిమోషన్ ఇచ్చే విధానం ఉంటుంది. సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన అంపైర్లను తదుపరి స్థాయికి ప్రమోట్ చేస్తారు. అదే సమయంలో ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని ఉన్నత కేటగిరీ అంపైర్లను కింది స్థాయికి పంపిస్తారు. అంపైర్లు సీజన్ మొత్తం అప్రమత్తంగా, అత్యంత సమర్థంగా వ్యవహరించేలా ఈ విధానం ఉపయోగపడుతుందని దేవజిత్ సైకియా తెలిపారు. అంపైర్ల నిర్ణయాలపై ఆటగాళ్ల కెరీర్‌లు కూడా ఆధారపడి ఉంటాయని.. అందువల్ల వారు ఎంతో జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ పరిధిలో బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలను ఎందుకు తీసుకురాకూడదనే అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తదుపరి విచారణలో బీసీసీఐ తన వివరణ ఇవ్వనుంది. అక్టోబర్ 27న ఈ అంశం మరోసారి విచారణకు రానుందని సైకియా తెలిపారు. సంబంధిత అధికార యంత్రాంగం చేపట్టాల్సిన కొన్ని ప్రక్రియలు ఇంకా పూర్తికావాల్సి ఉందని చెప్పారు. బీసీసీఐ స్పోర్ట్స్ యాక్ట్ పరిధిలోకి రావాలంటే ముందుగా క్రికెట్‌ను ‘డిజిగ్నేటెడ్ స్పోర్ట్’గా గుర్తిస్తూ నిర్దిష్ట నోటిఫికేషన్ రావాల్సి ఉంటుందని వివరించారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొత్త నిబంధనల ప్రకారం బీసీసీఐ చర్యలు చేపడుతుందని తెలిపారు.

మరోవైపు ఐపీఎల్ 2027 మార్చి చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని దేవజిత్ సైకియా వెల్లడించారు. అలాగే బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ హెడ్ పోస్టు కోసం మరోసారి ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. క్రికెట్‌లో వయసు మోసాలను అరికట్టేందుకు కూడా బీసీసీఐ కీలక చర్యలు తీసుకుంది. తమ ఏజ్ ఫ్రాడ్ పాలసీలను మరోసారి సమీక్షించి, కొత్త SOPలను రూపొందించినట్లు సైకియా తెలిపారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశామని, వయసు విభాగాల టోర్నీలకు జట్ల ఎంపికలో వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలు దివ్యాంగ క్రికెటర్లకు అవసరమైన సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సైకియా తెలిపారు. దేశవ్యాప్తంగా దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సంఘాలను మరింతగా భాగస్వామ్యం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.