Site icon NTV Telugu

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకుండా పాకిస్తాన్ రెచ్చగొడుతోంది..

Ban

Ban

T20 World Cup 2026: భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లకు వెళ్లబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. కోల్‌కతా, ముంబై వేదికలుగా బంగ్లా మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, వాటిని శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)ను కోరింది. అయితే, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ ఢాకా తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా, భద్రతా కారణాలను చూపిస్తూ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. భారత్‌లో ఆడటం వల్ల తమ జట్టుకు నిజమైన భద్రతా ప్రమాదాలు ఉన్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది.

Read Also: Yamaha Recalls: అలర్ట్.. మీతో ఈ యమహా స్కూటీలు ఉన్నాయా? వెంటనే షోరూంకి తీసుకెళ్లండి!

ఇక, బంగ్లాదేశ్ నిర్ణయంపై 1983 వరల్డ్ కప్ విజేత, మాజీ భారత పేసర్ మదన్ లాల్ తీవ్రంగా మండిపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనకపోతే అది భారత్‌కు ఎలాంటి నష్టం కాదు, కానీ బంగ్లాదేశ్‌కే భారీ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా, క్రికెట్ అభివృద్ధి పరంగా బంగ్లాదేశ్ చాలా కోల్పోతుందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా మూర్ఖత్వపు నిర్ణయం.. భారత్‌కు ఏం నష్టం జరగదు.. కానీ బంగ్లాదేశ్‌కు మాత్రం అన్నీ నష్టలే జరుగుతాయని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద టోర్నమెంట్‌లో ఆడకపోవడం వల్ల ఆర్థికంగా, వాణిజ్యంగా భారీ దెబ్బ పడుతుంది.. ఈ నిర్ణయం వెనుక పాకిస్తాన్ ప్రేరణ ఉందని నేను భావిస్తున్నాను.. భారత్‌ను కిందకు దించాలనే ఉద్దేశంతోనే వారు బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతున్నారని మదన్ లాల్ ఆరోపించారు.

Read Also: Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్..

అయితే, బంగ్లాదేశ్ ముంబైలో మ్యాచులు ఆడాల్సి ఉంది.. ముంబై భారత్‌లోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి అని మాజీ క్రికెటర్ మదన్ లాల్ తెలిపారు. భారత క్రికెట్ బోర్డుకు కానీ, భారత్‌కు కానీ దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.. ఇది పూర్తిగా రాజకీయమే.. తమను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల కాలంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది.. బంగ్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడులు, హింసాకాండలపై భారత్‌లో ఆందోళనలు జరిగాయి.. గత ఏడాది ఈ ఘటనలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని కోరింది. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత భారత్‌లో తమ జట్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ వెల్లడించింది. అందుకే 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడాన్ని తిరస్కరిస్తున్నామని పేర్కొంది.

Exit mobile version