Site icon NTV Telugu

SA vs BAN: పేరుకు టెస్ట్ మ్యాచ్.. 20 ఓవర్లు కూడా ఆడలేకపోయిన బంగ్లాదేశ్

South Africa

South Africa

డర్బన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్‌ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.

కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 367 పరుగులు చేయగా… బంగ్లాదేశ్ 298 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్‌గా 274 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్ ముందు ఉంచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేసి మొత్తం 10 వికెట్లను సాధించారు. కేశవ్ మహరాజ్ 7 వికెట్లు తీయగా హార్మర్ 3 వికెట్లు సాధించాడు. పేరుకు ఇది టెస్ట్ మ్యాచ్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 54 పరుగులకే చేతులెత్తేసింది. ఒక ఇన్నింగ్స్ మొత్తంలో ఓవర్లు మొత్తం ఇద్దరు బౌలర్లే పంచుకోవడం.. అన్ని వికెట్లు వారిద్దరే తీయడం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది 28వ సారి. దక్షిణాఫ్రికా జట్టుకు మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సంపాదించింది.

https://ntvtelugu.com/punjab-kings-player-vaibhav-arora-is-new-sensation-in-ipl-2022/

Exit mobile version