Babar Azam: బాబర్ అజామ్‌.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!

Babar Azam Trolls

Babar Azam Trolls

Babar Azam Criticism: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. మొదటి టెస్టులో ఓడిన పాక్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. రెండో టెస్టులో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ 8, 6 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో బాబర్‌పై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర విమర్శలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవలేకపోతున్నాడంటూ మండిపడ్డాడు. అభిమానులు, సోషల్ మీడియా అతడిని గొప్ప ఆటగాడిగా భావిస్తున్నప్పటికీ.. కష్టమైన పరిస్థితుల్లో ప్రదర్శన చేయకపోతే ఆ ప్రశంసలకు అర్థం ఏమిటని అలీ ప్రశ్నించాడు.

తాజాగా ‘ది గేమ్ ప్లాన్’ కార్యక్రమంలో బాసిత్ అలీ మాట్లాడుతూ… ‘అంత సులభంగా ఎవరూ గొప్ప ఆటగాళ్లు కాలేదు. నేను సచిన్ టెండూల్కర్ గురించి కూడా మాట్లాడటం లేదు. నా దేశానికి చెందిన ఆటగాళ్ల గురించే మాట్లాడుతున్నాను. కష్టమైన సమయాల్లో మీరు ఏమీ చేయకపోతే ప్రయోజనం ఏంటి?. మీ అభిమానుల దృష్టిలో మీరు గొప్ప ఆటగాడై ఉండొచ్చు. సోషల్ మీడియాలో కూడా గొప్ప ఆటగాడిగానే కనిపించొచ్చు. జట్టుకు ఉపయోగపడనప్పుడు ఎంత పెద్ద ప్లేయర్ అయితే ఏంటి?’ అంటూ బాబర్‌ అజామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టెస్టు క్రికెట్‌లో బాబర్ అజామ్ ఫామ్‌పై కూడా బాసిత్ అలీ ప్రశ్నలు సంధించాడు. దాదాపు నాలుగేళ్లుగా బాబర్ టెస్టుల్లో సెంచరీ సాధించలేకపోతున్నాడని గుర్తుచేశాడు. జట్టు బ్యాటింగ్ మొత్తం అతడిపైనే ఆధారపడుతున్న సమయంలో చెత్త షాట్ ఆడి వికెట్ కోల్పోకూడదని సూచించాడు. ‘బాబర్ గురించి నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. నాలుగేళ్లుగా అతడు టెస్టు సెంచరీ చేయలేదు. ఎప్పుడు చేస్తాడు?. దేశం మొత్తం బ్యాటింగ్ నీపై ఆధారపడినప్పుడు ఇది బాధ కలిగించే విషయం. కనీసం అలాంటి చెత్త షాట్ ఆడి ఔట్ కాకుండా ఉండాలి’ అని వ్యాఖ్యానించాడు.

లీడ్స్ టెస్టుకు గాయం కారణంగా దూరమైన బాబర్ అజామ్.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కీలక సమయంలో జట్టుకు పరుగులు చేయలేకపోయాడు. అయితే ఇంగ్లండ్‌లో బాబర్‌కు మంచి రికార్డు ఉంది. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 65.75గా ఉంది. మూడు అర్ధసెంచరీలు కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై మొత్తంగా 14 ఇన్నింగ్స్‌ల్లో 53.83 సగటు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ లేదా సెంచరీ నమోదు చేశాడు.

లార్డ్స్ టెస్టుకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్ పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 96.50 సగటుతో 193 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ లార్డ్స్‌లో ఆ అంచనాలను అందుకోలేకపోవడంతో విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో చాలా కాలంగా సెంచరీ రాకపోవడం బాబర్‌కు ప్రతికూలంగా మారింది. అజామ్‌కు భారీ అభిమానగణం ఉన్నప్పటికీ.. కఠిన పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలిచి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉందని బాసిత్ అలీ అంటున్నాడు.