Site icon NTV Telugu

T20 World Cup: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన ఆసీస్

Australia

Australia

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నాడు బ్రిస్బేన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ తన ఫేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అతడు మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ అరోన్ ఫించ్ మాత్రం హాఫ్ సెంచరీతో చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఫించ్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ (13) కూడా విఫలమయ్యాడు. ఫించ్‌కు స్టాయినీస్ తన వంతు సహకారం అందించాడు. స్టాయినీస్ 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేసి రాణించాడు.

Read Also: T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్.. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు

180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 48 బంతుల్లో ఒక సిక్స్, 9 ఫోర్లతో 71 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతడికి మరో ఆటగాడు సహకరించి ఉంటే ఈ మ్యాచ్‌లో ఫలితం మరోలా ఉండేది. అయితే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ చెత్త రికార్డు నమోదు చేశాడు. మీడియం పేసర్ మార్క్ రిచర్డ్ అడైర్ ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లతో ఏకంగా 11 బంతులేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కార్తీ తన సూపర్ ఫీల్డింగ్ విన్యాసంతో సిక్సర్‌ను కాస్త డబుల్‌గా మార్చడంతో అడైర్ మరో చెత్త రికార్డును తప్పించుకున్నాడు. లేకుంటే ఒకే ఓవర్‌లో 30 పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలోకి ఎక్కేవాడు. ఈ మెగా టోర్నీలో ఒకే ఓవర్‌లో అత్యధిక వైడ్లు వేసిన బౌలర్‌గా పరుగులిచ్చిన ప్లేయర్‌గా అడైర్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ విజయంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు కూడా 5 పాయింట్లే ఉన్నా ఆ జట్టు నెట్ రన్‌రేట్ ప్లస్‌లలో ఉండగా ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్ మాత్రం మైనస్‌లలో ఉంది.

Exit mobile version