Site icon NTV Telugu

T20 World Cup: ఆస్ట్రేలియాకు మరో షాక్.. స్టార్ వికెట్ కీపర్‌కు కరోనా

Mathew Wade

Mathew Wade

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కరోనా కారణంగా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కాగా ఇప్పుడు స్టార్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. బుధవారం సాయంత్రం మాథ్యూ వేడ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు తదుపరి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న మెల్‌బోర్న్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. వేడ్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి అతడికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం కోవిడ్ వచ్చినా మ్యాచ్ ఆడే సౌలభ్యం ఉండటంతో వేడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.

Read Also: Whatsapp New Feature: వాట్సాప్‌ మరో అదిరిపోయే ఫీచర్.. ఇక నో టెన్షన్‌..!

ఒకవేళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వేడ్ ఆడకపోతే అతడి స్థానంలో వికెట్ కీపర్ ఎవరు చేస్తారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ టోర్నీ కోసం రెండో వికెట్ కీపర్‌గా జట్టులో ఎంపికైన జోష్ ఇంగ్లీస్ గాయం కారణంగా దూరమయ్యాడు. గోల్ఫ్ ఆడుతుండగా అతడికి గాయమైంది. అతడి స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ జట్టులోకి వచ్చాడు. 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన తర్వాత గ్రీన్ అసాధారణంగా రాణించడంతో అతడిని ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే వేడ్ స్థానంలో వార్నర్ లేదా మ్యాక్స్‌వెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆడమ్ జంపా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడు ప్రస్తుతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Exit mobile version