Site icon NTV Telugu

Ashleigh Gardner: వచ్చే 5-10 ఏళ్లలో భారత జట్టును ఓడించడం చాలా కష్టం!

Ashleigh Gardner

Ashleigh Gardner

రాబోయే 5-10 సంవత్సరాలలో భారత మహిళా జట్టును ఓడించడం చాలా కష్టం అని గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గార్డ్‌నర్‌ అన్నారు. ఒక ఆస్ట్రేలియా అమ్మాయిగా మాకిది ఇబ్బందికర విషయమే అయినా.. భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌ వేగంగా ఎదుగుతున్న తీరు గొప్పగా అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం భారత మహిళా జట్టు అద్భుతంగా ఆడుతోందని కొనియాడారు. జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారని, కొందరు ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నారని ఆష్లీ గార్డ్‌నర్‌ చెప్పుకొచ్చారు. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 కోసం గార్డ్‌నర్‌ భారత్ వచ్చిన విషయం తెలిసిందే.

ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌ 2025 సెమీఫైనల్‌లో భారత్‌ చేతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఓటమి పాలై రెండు నెలలకు పైగా గడిచినా.. ఆ నిరాశ ఇంకా మిగిలే ఉందని అష్లీ గార్డ్‌నర్‌ వెల్లడించారు. 2025 అక్టోబర్‌ 30న డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ‘ఆ ఓటమి చాలా నిరాశ కలిగించింది. ఆ విషయాన్ని నేను ఏమాత్రం దాచడం లేదు. మేమే ఇప్పటికీ బెస్ట్‌ టీమ్‌ అనేది నా నమ్మకం. ఏ జట్టుతో అయినా పది మ్యాచ్‌లు ఆడితే.. 8-9 మ్యాచ్‌లు మేమే గెలుస్తామని అనుకుంటాను. ఇది కొంచెం అహంకారంగా అనిపించొచ్చు కానీ.. మేము ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అనే నమ్మకం నాకు ఉంది’ అని గార్డ్‌నర్‌ చెప్పారు. జనవరి 9 నుంచి ప్రారంభమయ్యే డబ్ల్యూపీఎల్‌ నాలుగో సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ (జీజీ) జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్న గార్డ్‌నర్‌.. మంగళవారం ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన జట్టు ప్రీ–సీజన్‌ ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్‌ జెయింట్స్‌ వేలంలో రూ.60 లక్షలకు కొనుగోలు చేసిన భారత పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌పై కూడా అష్లీ గార్డ్‌నర్‌ ప్రశంసలు కురిపించారు. ‘రేణుకా ప్రతిభ గురించి నాకు బాగా తెలుసు. ఆమె పవర్‌ప్లేలో వికెట్లు తీసే బౌలర్‌. కఠిన పరిస్థితుల్లో కూడా అద్భుత బంతి వేయగల సామర్థ్యం ఆమెకు ఉంది. మ్యాచ్‌ ఆరంభంలోనే బంతిని ఆమె చేతికి ఇచ్చే అవకాశం ఉండడం, ఆమెపై పూర్తి నమ్మకం కలగడం నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది’ అని గార్డ్‌నర్‌ పేర్కొన్నారు. గత సీజన్‌లో తొలి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ సాధించే అవకాశాన్ని గుజరాత్‌ చేజార్చుకుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం ఆ లోటును పూడ్చుకోవాలనే పట్టుదలతో గుజరాత్‌ బరిలోకి దిగుతోంది. జనవరి 10న ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో యూపీ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌తో జెయింట్స్‌ తమ డబ్ల్యూపీఎల్‌ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు:
బ్యాటర్లు: డానీ వైట్‌–హాడ్జ్‌, బెత్‌ మూనీ (వికెట్‌కీపర్‌), యస్తిక భాటియా, శివాని సింగ్‌, భర్తి ఫుల్మాలి
ఆల్‌రౌండర్లు: సోఫీ డివైన్‌, ఆశ్లే గార్డ్నర్‌ (కెప్టెన్‌), జార్జియా వేర్‌హామ్‌, కనిక ఆహుజా, ఆయుషి సోని, కాశ్వీ గౌతమ్‌, తనుజా కన్వర్‌, కిమ్‌ గార్థ్‌, అనుష్క శర్మ
బౌలర్లు: హ్యాపీ కుమారి, టితాస్‌ సాధు, రాజేశ్వరి గాయకవాడ్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌.

Exit mobile version