Site icon NTV Telugu

Arshdeep Singh: ఎంట్రీలోనే అదుర్స్‌.. 16 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Arshdeep Breaks 16 Year Old

Arshdeep Breaks 16 Year Old

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. అరంగేట్రంలోనే అదరహో అనిపించాడు. ఒక మెయిడెన్ ఓవర్ వేసి.. 16 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బౌలర్‌ ఝులన్‌ గోస్వామి .. అదే ఏడాదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అజిత్‌ అగార్కర్‌.. తమ ఎంట్రీ మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసి చరిత్రపుటలకెక్కారు. ఆ ఇద్దరి తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చిన అతడు.. రీస్‌ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్‌ రూపంలో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో, అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

‘‘అర్ష్‌దీప్.. నీ ఎంట్రీ అదిరిపోయింది. టీమిండియాకు ఆడగల అర్హతలన్నీ ఉన్నాయి. ఇలాగే చెలరేగిపో’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అతడ్ని కొనియాడుతున్నారు. ఇదిలావుండగా.. ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు జట్టు తరఫున ఆడిన అర్ష్‌దీప్, మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే భారత జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి, జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, ఎంట్రీ మ్యాచ్‌లోనే 16 ఏళ్ల రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో భారత్ అద్భుతంగా రాణించడంతో తొలి మ్యాచ్ కైవసం చేసుకోగలిగింది. 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.. సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

Exit mobile version